సాక్షి, ముంబై : ముంబై నాగపాడాలో శనివారం సాయంత్రం జరగాల్సిన ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఒవైసీ బహిరంగ సభకు పోలీసులు అనుమతని నిరాకరిచారు. దీంతో సభను రద్దు చేయాల్సివచ్చింది. అయితే సభ రద్దయిందన్న విషయాన్ని శుక్రవారం రాత్రి వరకు ఎంఐఎం నాయకులెవరూ ప్రకటించలేదు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బైకలా నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి వారిస్ పఠాన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయన విజయత్సవంతోపాటు ఓటర్లకు కృత/్ఞతలు తెలిపేందుకు నాగపాడలో బహిరంగ సభ నిర్వహిస్తామని అందుకు అనుమతినివ్వాలని ఎంఐఎం ప్రతినిధులను పోలీసులను కోరారు. అయితే పోలీసులు శనివారం శాంతిభద్రతలను సాకుగా చూపుతూ అనుమతులు నిరాకరించారు. అయితే పుణేలో మాదిరిగా ఆడిటోరియం, లేదా నాలుగు గోడల మధ్య హాలులో సభ నిర్వహించుకోవచ్చని చెప్పినట్టు తెలిసింది. అందుకు తగిన ప్రదేశం లభ్యం కాకపోవడంతో సభను రద్దు చేయాల్సి వచ్చినట్టు తెలిసింది. దీనిపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో శనివారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. సభకు అనుమతినిప్పించాలని వారు కోరినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ శనివారం ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.