సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తనవంతు పాత్ర పోషిస్తున్న మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)... మహారాష్ట్రలోనూ పార్టీని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో ఇప్పటికే పార్టీ కార్యాలయాలను ప్రారంభించింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ... రాష్ట్రంలో మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో నివసించే ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందులోభాగంగా మరాఠ్వాడాలోని పర్భణి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ఇటీవల ఏర్పాటు చేసిన అసదుద్దీన్... తొలిసారిగా అక్కడ శుక్రవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీ సంఖ్యలో యువకులు హాజరుకావడం విశేషం. ఇటీవలి నాందేడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలను సాధించింది. ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది. ఈ ఫలితాలు ఆ పార్టీ నాయకులకు కొండంత ఊపిరినిచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీని విస్తరించాలని నిర్ణయించినట్టు తెలి యవచ్చింది. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది.మైనారిటీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మరాఠ్వాడాలో ముస్లింలు 25 శాతం మంది ఉన్నారు. కొన్ని నియోజక వర్గాల్లో మైనారిటీ ఓటర్ల సంఖ్య 30 నుంచి 40 శాతం దాకా ఉంది. ఇదిలాఉంచితే ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో పొత్తులు కూడా పెట్టుకునే అంశాన్ని కూడా ఎంఐఎం పరిశీలిస్తోంది. ఒకవేళ ఎంఐఎం పార్టీ ఇక్కడ కూడా బలోపేతమైతే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చని, ఆ పార్టీకి కొంతమేర నష్టం కూడా వాటిల్లవచ్చని రాజ కీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మైనార్టీ ఓటర్లపై సమాజ్‌వాదీ పార్టీ ప్రభావం కూడా పడింది. దీంతో కొంతమంది నాయకులు ఆ పార్టీలో చేరారు.