110వ చట్టం ప్రకారం ప్రకటించిన పథకాలన్నీ అమలు చేశారా? దీనిపై చర్చించేందుకు జయలలిత సిద్ధమేనా?
వేలూరు: 110వ చట్టం ప్రకారం ప్రకటించిన పథకాలన్నీ అమలు చేశారా? దీనిపై చర్చించేందుకు జయలలిత సిద్ధమేనా? అని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ప్రశ్నించారు. ఆయన బుధవారం తిరువణ్ణామలై, కల శపాక్కం, పోలూరు, సెంగం నియోజక వర్గాల్లో డీఎం కే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మేనిఫెస్టోలో 54 పథకాలను ప్రకటించారని, 600కు పైగా తీర్మానాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టారన్నారు. అయితే అవేవి అమల్లో లేవన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి బహిరంగంగా చర్చించేందుకు జయలలిత తిరువణ్ణామలైకి రాగలరా? అని ప్రశ్నించారు.
ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి జరగలేదని, అయితే ప్రస్తుతం జయలలిత వంద యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా రుణాలను రద్దు చేస్తామని, రైతులకు రుణ మాఫీ చేస్తామని తెలిపారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటూ పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. ప్రచారంలో ఆయా నియోజక వర్గాల అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.