కత్తి చిత్రం నా సినీ జీవితంలో చాలా ముఖ్యమైనది
కోట్లు కూడబెట్టినా నోట్ల కట్టలు తినలేము. ఆకలి తీర్చేది అన్న మే. అలాంటి అన్నదాతే అన్నమో రామచంద్రా అంటూ...నిలువ నీడ లేక కడుపు నింపుకోవడానికి కూలి పనులు చేసుకునే దుస్థితి పడుతోంది. కొందరు కార్పొరేటర్ల దురాగత చర్యలే ఇందుకు కారణం. ఇలాంటి ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం కత్తి. నటుడు విజయ్ నటిం చిన ఈ చిత్రానికి ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా తెరపై కొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
చిత్ర విజయోత్సవంతో పాటు పేదలకు పలు సహాయాలు అందించే కార్యక్రమం మంగళవారం కోవైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు విజయ్ మాట్లాడుతూ కత్తి తన సినీ జీవితంలో చాలా ముఖ్యమైన చిత్రం అని వ్యాఖ్యానించారు. సగటు మనిషి అత్యవసరమైన కూడు, గుడ్డ, గూడులలో అతి ముఖ్యమైనది కూడు (ఆహారం) అన్నారు. దాన్ని అందించే అన్నదాత ఆర్తనాదం ఇతివృత్తమే కత్తి చిత్రమన్నారు. అలాంటి చిత్రంలో నటించడం మనశ్శాంతిని కలి గించిందన్నారు. ఎందరో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. మరెందరో వలసపోయి కూలి చేసుకుని పొట్ట పోసుకుంటున్నారన్న విషయాలు ఈ చిత్రంలో నటించడం ద్వారా తాను తెలుసుకున్నానని చెప్పారు.
ఇంత తెలిసిన తాను ఊరికే ఉండలేకపోయానన్నా రు. అందుకే ఈ చిన్న సాయం చేసే కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఆకలంటూ వచ్చిన వారికి రెండు చేపలను దానం చేసే కంటే వాటిని పట్టుకునే వలను ఇస్తే బాగుంటుందని చాలామంది అనడం విన్నానన్నారు. తానయితే రెండు చేపలతోపాటు వలను కూడా దానం చేయాలంటానన్నారు. ఒకరోజు సంపాదించిన దానిలో కొంత పేదలకు దానం చేస్తే పోయేదేమీ లేదన్నారు. ఒక ఊరిలో ఎక్కువ ఆస్పత్రిలో ఉంటే అక్కడ మనుష్యులకు అనారోగ్యం అధికంగా ఉన్నట్లు లెక్క. అదే విధంగా దానం చేసేవారు అధికంగా ఉంటే అక్కడ నిరుపేదలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సాయం కోసం చేతులు చాచే వారు లేకుండా పోతారో అప్పుడే మనదేశం పురోగతి సాధించిందని భావించవచ్చన్నారు.