
నీవు లేని జీవితం మాకొద్దు
► డెత్‌నోట్ రాసి తల్లీ, కుమారుడు రైలు కిందపడి ఆత్మహత్య
► చిన్న కుమారుడి ఆత్మహత్య జీర్ణించుకోలేక బలవన్మరణం
కర్ణాటక: చిన్న కుమారుడి మరణం జీర్ణించుకోలేని ఒక తల్లి తన పెద్ద కుమారుడితో కలిసి డెత్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన హృదయ విదారక సంఘటన దేవనహళ్లి తాలూకాలో చోటుచేసుకుంది. తాలూకాలోని యలియూరుకు చెందిన తల్లి సుజాత (35), ఈమె పెద్ద కుమారుడు సూర్యతేజ్ (17) ఇద్దరూ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మూడు రోజుల క్రితం సుజాత చిన్న కుమారుడు చంద్రతేజ్ (12) ఇంట్లో గొడవతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న సుజాత సోమవారం సాయంత్రం తన పెద్దకుమారుడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మంగళవారం వీరు రైలు పట్టాలపై శవాలై కనిపించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి డెత్‌నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో చంద్రతేజ్ మృతితో బాధతాళలేక ఆత్మహహత్య చేసుకుంటున్నామని, తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఇద్దరినీ ఒకే గుంతలో పూడ్చిపెట్టాలని కోరారు. అందులో విల్సన్ బాల్, పౌడర్ డబ్బా, చెప్పులు కూడా వేయాలని, అంగడి సరస్వతమ్మ, ఆనంద్ అనే ఇద్దరి వద్ద చిన్నమొత్తం అప్పు తీసుకున్నామని, ఆ డబ్బు ఇంట్లో టీవీ కింద పెట్టామని అది వారికి ఇవ్వాలని రాసుకున్నారు. యశ్వంతపూర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.