సోమవారం జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో జరిగిన జిల్లా అభివృద్ధి, ముఖ్యమైన ప్రభుత్వ పథకాల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా తొలి సమావేశం ముచ్చటగా మూడుగంటల పాటు జరగగా.. ప్రభుత్వ చీఫ్‌విప్ అభివృద్ధిపై అధికారులకు పలు సూచలను చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం లక్ష్యం నెరవేరితేనే ఇది సాధ్యమతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వార్డు మెంబర్ మొదలు ఎంపీలు, మంత్రుల వరకు సమష్టిగా కష్టపడాలని సూచించారు.
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లడంతోపాటు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు పేపర్ పనులకే పరిమితంకాకుండా ప్రజల మధ్య ఉండాలని ఆదేశించారు. మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. మైనార్టీ, వెనకబడినవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ స్పష్టం చేశారు. పదిహేను రోజులకోసారి సమీక్ష సమావేశం నిర్వహించుకుని అర్హులను గుర్తించే కార్యక్రమం పెట్టుకోవాలని కలెక్టర్ శరత్‌కు సూచించారు. ఒంటరి మహిళలు, జోగినీలకు ఆర్ధిక వెసులుబాటు కల్పించే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్నారు. వ్యాధులపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని సుగంధిని ఆదేశించారు.
నిరుపయోగంగా ఉంటున్న నిధులు వెన క్కిపోకుండా వాటిపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్య రాకముందే దాన్ని గుర్తించి ప్రణాళికబద్ధంగా.. మనస్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు తమ తమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతోన్న పథకాల పురోగతిని ప్రజాప్రతినిధులకు వివరించారు. మిషన్‌కాకతీయ ఈఈ బుచ్చిరెడ్డి వూట్లాడుతూ.. జిల్లాలోని 18 మండలాల్లో 1226 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇరిగేషన్ ఈఈ జ్ఞానకుమార్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లా నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల మెట్‌పల్లి నియోజకవర్గాల్లో 484 ఆవాసా ప్రాంతాలకు తాగునీరు అందించాల్సి ఉందన్నారు.
ఈ ఏడాది డిసెంబర్‌లోగా వెల్గటూరు మండల పరిధిలోని 32 ఆవాస ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి న ల్లానీరు అందిస్తామన్నారు. మొత్తం 1352 కిలో మీటర్ల వరకు పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. ప్రస్తుతం 311 కిలోమీటర్ల వరకు పైప్‌లైన్ పూర్తయిందన్నారు. వెల్గటూరు మండలంలో 69 కిలో మీటర్లకు గాను6 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణం జరిగిందన్నారు. కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. హరితహారం పథకంలో జిల్లా 90 శాతం అభివృద్ధి సాధించిందన్నారు. సబ్‌కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి పథకం కింద జిల్లాలో 939 దరఖాస్తులు రాగా.. 339మందికి మంజూరు చేశామన్నారు. 21 మందికి చెక్కులు ఆందజేశామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌బాబు, విద్యాసాగర్‌రావు, ఎస్పీ అనంతశర్మ తదితరులు పాల్గొన్నారు.