బాబూ.. మాది మీలా స్వార్థయాత్ర కాదు
ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎందుకు పాదయాత్ర చేశారో ఎవరికీ తెలియదని.. తమది ఆయనలా స్వార్థయాత్ర కాదని, జాతికోసమే చేస్తున్నానని కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ఎన్నికల్లో మీరిచ్చిన హామీని అమలుచేయమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. తమ జాతి అంటే అంత చులకనా అంటూ నిలదీశారు. మీలాగ మేం కేసులకు భయపడేది లేదు.. కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకునేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని రోజులు గృహనిర్బంధంలో ఉంచుతారో మీ ఇష్టమని.. తమవాళ్లతో చర్చించి పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటానని ముద్రగడ చెప్పారు.
వచ్చేనెల రెండోతేదీన కాపు జేఏసీ నేతలతో సమావేశమై తదుపరి సత్యాగ్రహ యాత్ర గురించి నిర్ణయం తీసుకుంటామని పద్మనాభం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో సెక్షన్ 30, 144 అమలులో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం జనచైతన్య యాత్రలు ఎలా నిర్వహిస్తున్నారని అడిగారు. వాళ్లకో రూలు.. తమకో నిబంధనా అని ఆయన మండిపడ్డారు.