సాక్షి, ముంబై: డాక్‌యార్డ్ ప్రాంతంలో గత శుక్రవారం భవనం కూలిన ఘటనకు బాధ్యులుగా అనుమానిస్తున్న ముగ్గురు బీఎంసీ అధికారులను స్థానిక శివ్డీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడైన అశోక్ జైన్ అనే డెకొరేటర్‌ను ఇదివరకే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కేసులో ఏడుగురు బీఎంసీ అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేయగా 11 మంది పాత్రపై దర్యాప్తుకు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే ఆదేశించారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు అధికారులపై ఆదివారమే సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీఎంసీ ఉన్నతాధికారులు రాజీవ్ జలోటా, మోహన్ అడ్తానితో ద్వీసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రాథమిక విచారణలో దోషులుగా తేలడంతో డి.సి.చవాన్-డిప్యూటీ సూపరింటెండెంట్ (మార్కెటింగ్ శాఖ). రాహుల్ జాదవ్-అసిస్టెంట్ ఇంజినీర్ (మార్కెటింగ్ శాఖ), ఇన్‌స్పెక్టర్ (మార్కెటింగ్ శాఖ) జమాల్ కాజీని శివ్డీ పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారిపై విచారణ జరుగుతోంది. ఇందులో ఎంతమంది దోషులుగా తేలుతారో, ఎంతమందిని అరెస్టు చేయాల్సి వస్తుందో త్వరలో వెల్లడవుతుందని కుంటే అన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 61 మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు పిల్లలు ఉండగా 28 మంది మహిళలున్నారు. మొత్తం 38 మంది గాయపడగా ఇందులో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 99 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మొత్తం 48 గంటల తరువాత భవన శిథిలాలను తొలగించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ 21 కుటుంబాలకు పునరావాసం కల్పించడం పెనుసవాలుగా మారింది. మాడా శరణార్థి శిబిరాలన్నీ కిక్కిరిసి ఉండడంతో వీరికి ఎక్కడ బస కల్పించాలో తెలియని పరిస్థితి నెలకొంది.
డాక్టర్ల సస్పెన్షన్
డాక్‌యార్డ్‌లో భవనం కూలడంతో గాయపడ్డవారికి వైద్యపరీక్షలు నిర్వహించడానికి డబ్బులు వసూలుచేసిన ముగ్గురు నాయర్ ఆస్పత్రి వైద్యులపై సెస్పెండ్ వేటు పడింది. మరో 11 మంది వైద్యులపాత్రపైనా విచారణ జరుగుతోంది. ఇందులో దోషులుగా తేలితే వీరిని కూడా సస్పెండ్ చేయనున్నారు. డాక్‌యార్డ్ దుర్ఘటనలో 61 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులందరికీ ఉచితంగా వైద్యం అందజేయాలని మేయర్ సునీల్ ప్రభు ఆదేశించారు. అయినప్పటికీ నాయర్ ఆస్పత్రిలోని బాధితుల నుంచి రక్తపరీక్షలు నిర్వహించేందుకు డబ్బులు వసూలు చేశారు. ఈ విషయాన్ని శ్వేతాకాంబ్లే అనే బాధితురాలు బయటపెట్టడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ముగ్గురు డాక్టర్లు దోషులుగా తేలడంతో సస్పెండ్ చేశారు.
బీఎంసీ అధికారులకు బేడీలు
Published Wed, Oct 2 2013 12:33 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement