అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ముంబై | Mumbai to be international finance centre, says Devendra Fadnavis | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ముంబై

Published Wed, Jan 21 2015 11:41 PM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ముంబై - Sakshi

అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా ముంబై

- ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కోసం కృషి
- దావోస్‌లో ముఖ్యమంత్రి ఫడ్నవీస్

దావోస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’తో స్ఫూర్తి పొందిన తాము ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కార్యక్రమం కోసం కృషి చేస్తున్నామని, ముంబైని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలోని రాష్ట్రాల మధ్య పోటీ పెరిగిందని చెప్పారు.

ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ఫడ్నవీస్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘మేక్ ఇన్ మహారాష్ట్ర’ కార్యక్రమానికి ఒక రూపునిచ్చామని ‘లెసైన్స్ రాజ’ను ముగించడంపైనే ఇక దృష్టిని కేంద్రీకరిస్తామని చెప్పారు. భూ సంస్కరణలను ప్రారంభించామని, అనుమతుల మంజూరును స్వయంచాలితం చేశామని అన్నారు. ఇదివరకు పరిశ్రమలు నెలకొల్పాలంటే కంపెనీలే ఏండ్లకొద్దీ వేచి చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు కొద్ది నెలల్లో పని పూర్తవుతుందని చెప్పారు.

ముంబైని అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంగా మార్చే ప్రయత్నాలు ఇదివరకు విఫలమయ్యాయి కదా అన్న ప్రశ్నకు ఈసారి తప్పకుండా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ హయాంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ముంబై ఆర్థిక కేంద్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) ప్రాంతంలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఉన్నాయని, మరిన్ని రావాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు.

అనుసంధానం, మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ముంబై పరిసరాల్లో మరిన్ని నగరాలను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఇక్కడ కనీసం 30 మంది ప్రపంచ వ్యాపారవేత్తలతో ఫడ్నవీస్ ముఖాముఖి సమావేశం కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement