నళినికి పెరోల్ హైకోర్టు ఉత్తర్వులు
టీనగర్:రాజీవ్‌గాంధీ హత్య కేసులో జైల్లో ఉన్న నళినికి తండ్రి 16వ రోజు కార్యంలో పాల్గొనేందుకు ఒక రోజు పెరోల్ అందజేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వేలూరు జైలులో యావజ్జీవ ఖైదీగా నళిని శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈమె హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ విధంగా తెలిపారు. తన తండ్రి శంకరనారాయణన్ గత ఫిబ్రవరి నెల 23వ తేదీ మృతిచెందారని, ఆయన అంత్యక్రియలు చెన్నైలో మరుసటి రోజు 24వ తేదీన జరిగాయని పేర్కొన్నారు.
ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తనకు వేలూరు జైలు సూపరింటెండెంట్ పెరోల్ అందజేయడంతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇలావుండగా తన తండ్రి 16వ రోజు కార్యం ఈ నెల తొమ్మిదవ తేదీన జరుగనుందని, ఇందులో పాల్గొనేందుకు మూడు రోజులు అనగా ఎనిమిదవ తేదీ నుంచి 10వ తేదీ వరకు పెరోల్ కోరుతూ జైలు సూపరింటెండెంట్‌కు గత రెండవ తేదీన పిటిషన్ అందజేసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఇంతవరకు పరిశీలన జరపలేదని, తనకు మూడు రోజులపాటు సెలవు అందజేసేందుకు సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులివ్వాలని కోరారు.
ఒక రోజు పెరోల్: హైకోర్టు నళిని తండ్రి 16వ రోజు కార్యంలో పాల్గొనేందుకు ఒక రోజు పెరోల్ అందజేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆమెకు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక రోజుపాటు పెరోల్ అందజేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల ఆధారంగా వేలూరు సెంట్రల్ జైలు అధికారులు ఆమెను ఒక రోజు పెరోల్‌పై విడుదల చేశారు. పోలీసుల భద్రత మధ్య ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు.