చినబాబు అలక?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అలిగినట్టు తెలుస్తోంది. తన తండ్రి మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయడం పట్ల ఆయన గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ శిక్షణా తరగతులకు వరుసగా రెండో రోజు లోకేశ్ గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో టీడీపీ ముఖ్యనేతల మూడు రోజుల కార్యగోష్ఠి మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు శిక్షణా తరగతులకు హాజరుకాని లోకేశ్ రెండో రోజైన బుధవారం కూడా గైర్హజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన కార్యగోష్ఠికి హాజరుకాకపోవడంతో లోకేశ్ ఎక్కడ? అనే ప్రశ్న టీడీపీ నాయకుల నుంచి వినిపించింది. ఆయన అలిగారని మెజారిటీ సభ్యుల నుంచి విన్పిస్తోంది.
లోకేశ్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు కొద్దిరోజుల క్రితం గవర్నర్ నరసింహన్ కు చంద్రబాబు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి. ఒకదశలో లోకేశ్ ను ఢిల్లీకి పంపించేందుకు చంద్రబాబు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే కేటీఆర్ లా కేబినెట్ లో చేరేందుకే లోకేశ్ మొగ్గుచూపినట్టు వార్తలు వచ్చాయి. దీంతో లోకేశ్ కు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది.
ముహూర్తం కుదరక చంద్రబాబు కేబినెట్ విస్తరణ వాయిదా వేశారు. కేబినెట్ పై ఆశలు పెట్టుకున్న చినబాబు ఈ నిర్ణయంతో కాస్త నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన హాజరుకాలేదన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ఇది నిజం కాదని నిరూపించాలంటే చివరి రోజైనా కార్యగోష్ఠికి లోకేశ్ హాజరయ్యేలా చూడాలని టీడీపీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.