
కేబినెట్ మార్పులపై అధినేతదే నిర్ణయం: లోకేశ్
సీల్డ్ కవర్లలో నేతల పనితీరు నివేదిక
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై అధినేత నిర్ణయం తీసుకుంటారని నారా లోకేశ్ అన్నారు. ఈ విషయంలో పార్టీ వారితో ఎలాంటి సంప్రదింపులు ఉండవని తెలిపారు. చంద్రబాబు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని, తాము దాన్ని ఆచరిస్తామని చెప్పారు. ఇప్పటికే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇక నుంచి కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
తనకు ఆరోగ్యం సరిగా ఉండకపోవటం వల్లే పార్టీ శిక్షణా తరగతులకు రెండు రోజులు హాజరు కాలేదన్నారు. మూడో రోజు సమావేశాల్లో పాల్గొని పార్టీ సభ్యత్వ నమోదుపై లోకేశ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం లోకేశ్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి జెండా మోస్తున్న వారిని కొంతమందిని ఎంపిక చేసి వారి కుటుంబం పేరుతో రూ. రెండు లక్షలు డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని ఫించను రూపంలో అందిస్తామన్నారు. కాగా, సమావేశంలో పాల్గొన్న నేతల పనితీరు నివేదికను చంద్రబాబు సీల్డ్ కవర్‌లలో అందించారు. తాను ఈ వివరాలను ఎవ్వరికి వెల్లడించనని, నేతలు కూడా బహిర్గతం చేయనన్నారు. ఎవరైనా అలా చేస్తే ఎవరి గుట్టును వారు బైట పెట్టుకున్నట్లేనని చెప్పారు. నాలుగు గ్రేడ్లుగా విభజించి నేతలకు సమాచారం అందించారు.