ఇందిరాగాంధీకి ఘన నివాళి
Published Wed, Nov 20 2013 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 96వ జయంతిని రాజీవ్‌భవన్‌లో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు జేపీ అగర్వాల్ నేతృత్వంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడారు. పేదలు, బలహీన వర్గాలు, వృద్ధులు, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నో కార్యక్రమాలు రూపొందించారని గుర్తుచేశారు. దేశంలోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పారదోలేందుకు ప్రవేశపెట్టిన ఇరవై సూత్రాల పథకం దేశవ్యాప్తంగా ఎన్నో ఫలితాలు ఇచ్చిందని అగర్వాల్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతికొద్ది మంది నాయకుల్లో ఇందిరాగాంధీ ఎప్పటికీ ఉంటారన్నారు. పరిపాలనలో ఆమె ధైర్యంగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. ప్రధానమంత్రిగా దేశభవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారని జైప్రకాశ్ అగర్వాల్ వివరించారు.
కార్యక్రమంలో డీపీసీసీ ఉపాధ్యక్షుడు సురేశ్‌మాలిక్, మున్సిపల్ కౌన్సిలర్ రమేశ్‌దత్, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ముఖ్య ప్రతినిధి దినేశ్ త్యాగి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోను బుధవారం విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. రాబోయే ఐదేళ్ల కాలంలో ఢిల్లీని మరింత అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలను ఇందులో వివరిస్తామని సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ‘మెట్రో, రోడ్ల విస్తరణ ద్వారా ప్రజరవాణా వ్యవస్థను అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతాం. అనధికార కాలనీలను మరింత అభివృద్ధి చేస్తాం. విద్య, వైద్యం, మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమంపై మా పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తుంది’ అని ఆయన వివరించారు.
Advertisement