లౌకికత్వం, రిజర్వేషన్లపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్‌సీపీ ప్రశ్నించింది.
ముంబై: లౌకికత్వం, రిజర్వేషన్లపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్‌సీపీ ప్రశ్నించింది. బడుగువర్గాల సంక్షేమం కోసం అప్పటి కేంద్రమంత్రి అర్జున్‌సింగ్ ఐఐఎం, ఐఐటీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించగా దాన్ని అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు చెందిన ‘యూత్ ఫర్ ఈక్వాలిటీ ఫోరం’ విభేదిస్తోంది. కాగా, ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పోటీచేయాలని భావిస్తున్న నేపథ్యంలో రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టం చేయాలని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ డిమాండ్ చేశారు. ‘మేం రిజర్వేషన్లపై స్పష్టంగా ఉన్నాం. మీ సంగతేంటి..’ అని ఆప్ నాయకులను ప్రశ్నించారు. అలాగే శివసేన దివంగత నాయకుడు బాల్‌ఠాక్రేకు రాజకీయాల్లో మహిళలు రాణించడం ససేమిరా ఇష్టం లేదన్నారు. ‘మహిళలు వంటగదులకే పరిమితమవ్వాలని ఠాక్రే పలు సభల్లో వ్యాఖ్యానించారు. మహిళల పాత్ర ముందు వంటగదికి.. తర్వాత పిల్లల క్షేమం చూసుకోవడానికే పరిమితమవ్వాలి అంటూ ఠాక్రే అనేవారిని.. అదే పద్ధతిని ఆ పార్టీ ఇప్పటికీ పాటిస్తోందని విమర్శించారు.
తమకు అధికారమిస్తే రోడ్లు, ఫ్లైఓవర్లు, జాతీయ రహదారులపై టోల్‌ను రద్దుచేస్తామని బీజేపీ నేత గోపీనాథ్ ముండే చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు. ‘రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ నేత నితిన్ గడ్కారీ రోడ్ల నిర్మాణంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించారు. ఆయా రహదారులపై టోల్ వసూలు ద్వారా పెట్టుబడులను వసూలు చేసుకోవాలని సూచించారు. దీన్ని అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం అంగీకరించింది. అలాంటిది ఇప్పుడు అధికారం కోసం మీరు ఇలా మాట్లాడుతున్నారు..’ అని ఆయన దుయ్యబట్టారు.