ముంబై: ‘మా నాయకుడిపై విమర్శలు చేయడం కాదు.. దమ్ముంటే బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి సుప్రియ సులేపై పోటీ చేసి నెగ్గు.. నీ బలం ఏంటో తెలుస్తుంది.. సీనియర్ నాయకుడైన శరద్‌పవార్‌పై విమర్శలు చేసే స్థాయి నీకు లేదు..’ అంటూ శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేపై సోమవారం ఎన్‌సీపీ నేతలు నిప్పులు చెరిగారు. శిరూర్‌లో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో ఉద్ధవ్ మాట్లాడుతూ ‘ఇక్కడ నుంచి కేంద్రమంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ పోటీచేసినా డిపాజిట్లు దక్కవు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ నాయకులు ,కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక సీనియర్ నాయకుడైన పవార్‌పై వ్యాఖ్యలు చేసేటప్పుడు భాషను అదుపులో పెట్టుకోవాలి. ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనని ఇప్పటికే శరద్‌పవార్ ప్రకటించారు.
అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు..’ అని ఎన్సీపీ రాష్ర్ట అధ్యక్షుడు భాస్కర్ జాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జితేంద్ర అహ్వాద్ విమర్శలు గుప్పించారు. ‘ఉద్ధవ్‌కు దమ్ముంటే.. బారామతి నుంచి సుప్రియా సులేపై పోటీ చేయాలి..లేదా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మాపైనైనా పోటీచేసి గెలవాలి..’ అంటూ సవాలు విసిరారు. ‘ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడితే పార్టీ కార్యకర్తల కష్టసుఖాలు తెలుస్తాయి.. మాతోశ్రీలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు..’ అంటూ జాదవ్ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు శివసేన కార్యకర్త అయిన జాదవ్ ఆ తర్వాత పార్టీ నాయకత్వంతో విభేదించి ఎన్సీపీలో చేరారు. కాగా, శివసైనికులకు అవసరమైన ఉత్తేజపూరిత నాయకత్వాన్ని అందించడంలో ఉద్ధవ్ విఫలమయ్యాడని జాదవ్ విమర్శించారు. ‘శివసేన నాయకులు, కార్యకర్తల నుంచి అనుచిత ప్రవర్తన ఆశించడం తప్పే.. ఎందుకంటే వారు తమ పార్టీలోని సీనియర్ నాయకులకు గాని, మహిళలకు గాని ఎటువంటి మర్యాద నివ్వరు..’అంటూ గత ఏడాది దసరా ర్యాలీలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్ అయిన మనోహర్ జోషికి వ్యతిరేకంగా నినాదాలు చేయించడం, మాజీ మేయర్ సుభా రావుల్, కార్పొరేటర్ శీతల్ మాత్రేపై ఆ పార్టీ కార్యకర్తల అనుచిత ప్రవర్తనలను ఉదహరించారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఆరుగురు శివసేన ఎంపీలు ఆసక్తి చూపుతున్నారని భాస్కర్ జాదవ్ అన్నారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.
జితేంద్ర అహ్వాద్ మాట్లాడుతూ..‘ఉద్ధవ్ ఠాక్రే సీఎం అవుదామని కలలు కంటున్నాడు.. అది అసాధ్యం..ఇంట్లో కూర్చుని రాజకీయాలు చేయడం తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే దమ్ము, ధైర్యం ఆయనకు లేవు..’ అంటూ విమర్శించారు. ‘నీకు శరద్ పవార్ వంటి సీనియర్ నేతను విమర్శించే హక్కులేదు.. ఆయన 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు..22 సార్లు ఎన్నికల్లో గెలిచారు. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలి..’ అంటూ నిప్పులు చెరిగారు.‘ అసలు నీకు ధైర్యముంటే.. నాపై ముంబై-కావ్లా నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలువు..’ అంటూ సవాలు విసిరారు.
నోరు జాగ్రత్త
Published Tue, Jan 21 2014 12:29 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement
Advertisement