‘మావల్’ బరి చీలిక ఓట్లవైపే ‘శేత్కారీ’ చూపు | ncp try to stop laxman speed | Sakshi
Sakshi News home page

‘మావల్’ బరి చీలిక ఓట్లవైపే ‘శేత్కారీ’ చూపు

Published Sun, Apr 13 2014 10:36 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ncp try to stop laxman speed

పింప్రి, న్యూస్‌లైన్:  ప్రస్తుత ఎన్నికల్లో మావల్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్-ఎన్సీపీ ఉమ్మడి అభ్యర్థిగా రాహుల్ నార్వేకర్ పోటీ చేస్తుండగా, శేత్కారీ కామ్‌గార్ పార్టీకి చెందిన చించ్‌వాడ్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగతాప్ ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. లక్ష్మణ్‌కు స్వాభిమాన్ రిపబ్లికన్, ఎమ్మెన్నెస్ పార్టీలు అండగా నిలిచాయి. ఈ నియోజకవర్గంలో గెలుపును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎన్సీపీ.... లక్ష్మణ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు యత్నిస్తోంది. పింప్రి, చించ్‌వాడ్ పన్వేల్‌లలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి ఎన్సీపీ అగ్రనాయకుడు అజిత్‌పవార్ ముందుకు సాగుతున్నారు.

మరోవైపు ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్-ఎన్సీపీ ఓట్ల చీలికను నిరోధించేందుకు శరద్‌పవార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన అజామ్ పాన్సారే ఆ పార్టీకి వీడ్కోలు పలకడం, ఎన్సీపీకి మద్దతుగా నిలిచిన లక్ష్మణ్ జగతాప్ కూడా దూరం కావడం అధిష్టానానికి ఇబ్బందికరంగా పరిణమించింది. అయితే పాన్సారే కాంగ్రెస్‌లో చేరడం ఒకింత మేలైనప్పటికీ ప్రస్తుతం ఎన్సీపీ అభ్యర్థికి ఏమేరకు సహకరిస్తాడనేది వేచిచూడాల్సిందే. ఎన్సీపీ-కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే కాషాయ కూటమి ఇక్కడ విచిత్రపరిస్థితిని ఎదుర్కొంటోంది. శివసేన-బీజేపీ పొత్తు లో భాగంగా శివసేన అభ్యర్థిగా శ్రీరంగ భరణీ పోటీ చేస్తున్నారు. భరణికి ప్రస్తుతం మావల్, కర్జత్ బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ఎమ్మెన్నెస్. కాషాయ కూటమి ఓట్లను చీల్చేందుకు లక్ష్మణ్ జగతాప్‌కు మద్దతు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

 మావల్‌లో బీజేపీ పటిష్టానికి గత 20 సంవత్సరాలుగా రూపరేఖా డోరే, దిగంబర్ బేగడే, సంజయ్ భేగడే తదితర నాయకులు నిరంతరం శ్రమిస్తున్నారు. గతంలో మావల్ నుంచి బరిలోకి దిగి న శివసేన అభ్యర్థి గజానన్ బాబర్‌కు మెజారిటీ ఓట్లు లభిం చాయి. ఇక శ్రీరంగభరణి బీజేపీ, శివసేన కార్యకర్తలను సమన్వయ పరుస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇతడు కూడా కాషాయ కూటమిలో ఓట్ల చీలికను అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పోటీ త్రిముఖంగా కనిపిస్తుంది. ఓట్ల చీలిక ద్వారా లబ్ధి పొందాలని లక్ష్మణ్ ఆశిస్తుండగా, అసమ్మతి ఓట్లను రాబట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మారుతి బాప్కర్ కూడా పార్టీల్లో వచ్చే చీలిక ఓట్లపైనే ఆధారపడి ప్రచారం చేస్తున్నారు. ఈ నియోజకవర్గం బరిలోకి దిగిన బీఎస్సీ అభ్యర్థి టెక్సెస్ గైక్వాడ్ దళిత ముద్రతో ముందుకు సాగుతున్నారు. మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన రాందాస్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ శివసేనకు మద్దతుగా ప్రచారం చేస్తోంది.

 అటు కాషాయకూటమి బరిలో ఉండడం, ఇటు దళిత ఓట్లు,ఎన్సీపీ ఓట్ల చీలికపైనే ఆధారపడిన లక్ష్మణ్ ఏమేరకు విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే. ఈ నియోజకవర్గంలో పింప్రి, చించ్‌వాడ్, మావల్‌లోని దేహురోడ్ తదితర ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు వేలసంఖ్యలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలుగువారి అభిప్రాయాలను ‘న్యూస్‌లైన్’ సేకరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement