పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళతో సహా ఇతర రాష్ట్రాలకు కర్ణాటక నుంచి ఇసుక రవాణా, క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.
పొరుగు రాష్ట్రాలకు ఇసుక రవాణాపై సీఎం
సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు
ఫిల్టర్ ఇసుక వాడితే కఠిన చర్యలు
వారంలో ఇసుక సమస్య పరిష్కారం
వక్క సాగుపై నిషేధం లేదు
చెరుకు మద్దతు ధరపై నేడు వివరణ
సాక్షి,బెంగళూరు : పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళతో సహా ఇతర రాష్ట్రాలకు కర్ణాటక నుంచి ఇసుక రవాణా, క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శాసనసభలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇందుకోసం రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. సీనియర్ శాసన సభ్యుడు గోవిందకారజోళ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఇసుక రవాణా విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. ఫిల్టర్ ఇసుకతో నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఇసుక పాలసీపై అపోహలతో లారీ యజమానులు, డ్రైవర్లు సమ్మె చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే రాష్ట్ర లారీ యజమానుల సంఘం పదాధికారులతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపి ‘నూతన ఇసుక పాలసీ’ ఆవశ్యకతను తెలియజెప్పడంతో వారు సమ్మె విరమించారన్నారు.
బెంగళూరు నగరం పరిధిలో అన్ని నిర్మాణాల కోసం మైసూరు, మండ్యా, చామరాజనగరతో సహా 9 జిల్లాల నుంచి ఇసుకను సరఫరా చేయడానికి అనుమతులు ఇచ్చామన్నారు. వీటితో పాటు ఇకపై మిగిలిన అన్ని జిల్లాల నుంచి ఇసుక సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశామన్నారు. వారం లోపు ఇసుక సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 1,864 ఇసుక సేకరణ ప్రాంతాలున్నాయని, ఇసుక సేకరణకు గాను చదరపు అడుగుకు కనిష్టంగా రూ.250.. గరిష్టంగా రూ.930 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఏ ప్రాంతంలో ఎంత వసూలు చేయాలనేది స్థానిక అధికారులు నిర్ణయిస్తారన్నారు.
వక్క సాగుపై నిషేధం లేదు..
రాష్ట్రంలో వక్క పండించే విషయంలో ఎటువంటి నిషేధం విధించలేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే ఈ విషయంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోందని కర్ణాటక తరఫున కేఎన్ భట్ వాదనలు వినిపించారని అన్నారు. తుది తీర్పు కోసం ప్రభుత్వం వేచిచూస్తోందన్నారు.
మెట్రో పనుల్లో జాప్యం..
మెట్రో మొదటి దశ పనులు 2015 మార్చ్ 15 నాటికి పూర్తి చేస్తామని సీఎం పరిషత్‌కు తెలిపారు. భూ స్వాధీన ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల 48 కిలోమీటర్లు సాగే మెట్రో మొదటి దశ పనులను 2013 డిసెంబర్ నాటికి పూర్తి చేయలేకపోయామన్నారు.
చెరుకు మద్దతు ధరపై నేడు వివరణ..
చెరుకుకు రూ.2,500 చెల్లించాల్సిందేనని చక్కెర కర్మాగారాల యజమానులకు సూచించామన్నారు. అయితే ఈ విషయమై కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమన్నారు. మంగళవారం సాయంత్రం చక్కెర కర్మాగారాల యజమానుల సంఘంతో చర్చలు జరిపి మద్దతు ధర విషయమై బుధవారం శాసనసభకు స్పష్టమైన వివరణ ఇస్తానని విపక్ష నేత జగదీష్‌శెట్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.