ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,
ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమ్మ జయలలిత మార్గదర్శకంలో సాగుతున్న తన ప్రభుత్వం రైతులకు నష్టం కల్గించే నిర్ణయాన్ని తీసుకోదని హామీ ఇచ్చారు. నెడువాసల్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ప్రతినిధులతో బుధవారం సీఎం భేటీ అయ్యారు.
సాక్షి, చెన్నై : హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పుదుకోట్టై జిల్లా నెడువాసల్ వేదికగా ఉద్యమం బయలు దేరిన విషయం తెలిసిందే. యువత, విద్యార్థిలోకం, రాజకీయ, సినీ వర్గాలు సైతం ఉద్యమంలో భాగస్వామ్యం కావడంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండడం, పుదుకోట్టైలో బుధవారం బంద్‌కు పిలుపునివ్వడం వెరసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. పుదుకోట్టై, అరంతాంగి, తిరుమయం, ఆలంకుడి, కీలనూర్, విరాలిమలై, పొన్ అమరావతి, గందర్వకోట్టైలలో బంద్ సంపూర్ణ విజయవంతమైంది. దుకాణాలు మూత బడడంతో, రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి.
కూడంకులం అణు వ్యతిరేక ఉద్యమనేత ఉదయకుమార్, సినీ నటుడు మన్సూర్ అలీఖాన్, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పేరరివాలన్ తల్లి అర్బుతమ్మాల్ నెడువాసల్‌కు చేరుకుని ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, ఈ ప్రాజెక్టును వెనక్కు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతూ నెడువాసల్ వేదికగా ఉద్యమకారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వారితో సీఎం ఎడపాడిపళని స్వామి భేటీ అయ్యారు. ఆందోళన వద్దు...అనుమతి ఇవ్వం: నెడువాసల్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వేలుమణి, పన్నీరుసెల్వం, జయకుమార్, సెంథిల్, రామనాథంలతోపాటు 11 మంది ప్రతినిధులు సచివాలయం చేరుకున్నారు.
వీరితో సీఎం భేటీ అయ్యారు. ఆ ప్రాజెక్టు గురించి తాము సేకరించిన వివరాలు, ఆ పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వకుండా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతూ నివేదిక రూపంలో వినతి పత్రాన్ని సీఎం పళనిస్వామికి అందజేశారు. కేవలం పరిశీలన మాత్రమే సాగిందని, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, ఇవ్వబోదని ఈసందర్భంగా సీఎం స్పష్టం చేశారు. రైతులకు నష్టం, ప్రమాదం వాటిళ్లే నిర్ణయాన్ని తీసుకోమని ఉద్యమ కారులకు ఆయన హామీ ఇచ్చారు.
మీడియాతో వేలుమణి మాట్లాడుతూ, రైతుబిడ్డగా సీఎంకు తమ కష్టాలు తెలిసే ఉంటాయన్నారు. అమ్మ జయలలిత మార్గదర్శకంలో సాగుతున్న తన ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదని తమకు హామీ ఇచ్చారని, ఇది సంతృప్తికరంగాఉందన్నారు. నెడువాసల్‌లో ఉన్నవారితో చర్చించి ఉద్యమాన్ని కొనసాగించాలా, సీఎం హామీ మేరకు విరమించాలా అన్నది గురువారం ప్రకటిస్తామన్నారు.రామనాథపురం జిల్లాలోనూ ఈ ప్రాజెక్టు తగ్గ పరిశీలను సాగుతున్నట్టు, అడ్డుకోవాలని కోరుతూ ఎంఎంకే నేత జవహరుల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.