నోయిడా/ఘజియాబాద్: సాంకేతిక సమస్యల వల్ల నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో సోమవారం నుంచి రోజుకు కనీసం 10 గంటలపాటు కరెంటు నిలిపివేస్తుండడంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితి మరో రెండుమూడు రోజులపాటు కొనసాగవచ్చని అధికారులు చెబుతున్నారు. ట్రాన్సఫార్మర్ల ట్రిప్పింగ్, సరఫరా వ్యవస్థలో సమస్యల వల్ల తరచూ గంటల తరబడి కోతలు విధించడం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో సర్వసాధారణంగా మారింది. తాజాగా ఉత్తరాఖండ్‌లోని (యూకే) విష్ణుప్రయాగ్ జల విద్యుత్ ప్రాజెక్టు వరదల వల్ల దెబ్బతింది. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌కు 1,500 మెగావాట్ల కరెంటు సరఫరా ఆగిపోయింది.
దీంతో నోయిడా, ఘజియాబాద్‌లోనూ గంటల తరబడి కోతలు విధించక తప్పడం లేదు. ఈ రెండు నగరాల్లో రోజుకు దాదాపు 1,200 మెగావాట్ల కరెంటు అవసరం కాగా, ప్రస్తుతం సరఫరా అవుతున్నది వెయ్యి మెగావాట్లు మాత్రమే. నోయిడాలో నిత్యం ఆరు గంటలపాటు కోతలు విధిస్తుండగా, ఘజియాబాద్‌లో అయితే ఏకంగా 10 గంటలపాటు కరెంటు కనిపించడం లేదు. చెడిపోయిన యంత్రాలన్నింటినీ రెండురోజుల్లోగా బాగుచేస్తామని ఉత్తరప్రదేశ్ విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. నోయిడా వీఐపీ జాబితాలో ఉంది కాబట్టి ఇక్కడ కోతలు తొలగింపునకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని అంటున్నారు. ఎన్సీఆర్‌లో విద్యుత్ సంక్షోభం తలెత్తిన మాట నిజమే అయినా, రెండు మూడు రోజుల్లోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని యూపీ విద్యుత్ సంస్థ లిమిటెడ్ (యూపీసీఎల్) ఎండీ ఏపీ మిశ్రా ప్రకటించారు. మామూలు కోతలకు తోడు అర్ధరాత్రి రెండు గంటలు, ఉదయం రెండు గంటల కోతలు విధిస్తున్నారని నోయిడావాసులు ఫిర్యాదు చేశారు.
సెక్టార్ 36లో ఆదివారం ఉదయం పాడైన ట్రాన్స్‌ఫార్మర్‌ను సోమవారం సాయంత్రానికి బాగు చేశారని, అప్పటి వరకు అంధకారంలోనే గడిపామని స్థానికులు చెప్పారు. ఇది చాలవన్నట్టు కరెంటు సరఫరాలో తరచూ హెచ్చుతగ్గులు ఉండడం వల్ల టీవీ, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కంప్యూటర్ల ద్వారా పనిచేయాల్సిన వాళ్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని సెక్టార్ 19 ప్రాంతంలో ఉండే ఐటీ నిపుణుడు ఒకరు అన్నారు. దీనిపై యూపీసీఎల్ అధికారులు వివరణ ఇస్తూ నోయిడాలో రోజుకు రెండు గంటల చొప్పున మూడుసార్లు కోతలు విధిస్తున్నామని, 10 గంటల సేపు సరఫరా తీసేస్తున్నారన్న ఫిర్యాదుల్లో నిజం లేదని చెబుతున్నారు.
సోమవారం కూడా ఆరు గంటలే కోత విధించామని అన్నారు. ఘజియాబాద్‌లోని ఇందిరాపురం, వైశాలి, కౌశాంబి, వసుంధర ప్రాంతాలవాసులు రోజుకు దాదాపు 10 గంటల సేపు సరఫరా నిలిచిపోతోందని చెబుతున్నారు. ట్రాన్స్‌హిండన్ ప్రాంత అపార్టుమెంట్ల హౌసింగ్ సొసైటీలు డీజిల్ జనరేటర్ల ద్వారా కరెంటు అందిస్తున్నాయి. జనరేటర్ల ద్వారా కరెంటు సరఫరా చాలా ఖరీదని, యూనిట్‌కు రూ.15 చొప్పున చెల్లించాలని స్థానికులు అంటున్నారు. నెలకు వేలాది రూపాయలు కరెంటు బిల్లుల కోసమే వెచ్చించాల్సి వస్తోందని ఘజియాబాద్ అపార్టుమెంటు యజమానుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు.
ఎన్నాళ్లీ చీకటి రోజులు ?
Published Thu, Jul 24 2014 10:36 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement