నోయిడా: లోక్‌సభ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఉత్తర ప్రదేశ్‌లోని రెండు స్థానాల్లో దాఖలైన నామినేషన్లలో సగానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్‌లో 60 శాతం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)లో దాదాపు 56 శాతం మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక ఎన్నికల అధికారులు తెలిపారు.
ఘజియాబాద్‌లో 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 14 మంది అభ్యర్థుల దరఖాస్తులు ఆమోదించినట్లు జిల్లా ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పక్కనే ఉన్న గౌతంబుద్ధ్ నగర్‌లో 34 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయని, వారిలో 15 మంది అభ్యర్థులు చెల్లుబాటయ్యారని పేర్కొంది.
రెండు నియోజకవర్గాల్లో కలిపి 69 నామినేషన్లు రాగా అందులో 40 తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్‌లో నామినేషన్ల తిరస్కరణ 60 శాతం కాగా, గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో 55.89 శాతంగా నమోదైంది.
అధికారిక జాబితా ప్రకారం.. ఘజియాబాద్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment