- పలు ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ సీపీ విస్తృత ప్రచారం
- బెంగళూరులో రెండు లక్షల మంది సీమాంధ్రులు
- వారిలో 75 శాతం మంది వైఎస్‌ఆర్ పథకాలతో లబ్ధి
- టీడీపీ ప్రలోభాలకు లొంగని వైనం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సీమాంధ్రలో బుధవారం జరుగనున్న ఎన్నికల్లో పాల్గొనడానికి ప్రవాసాంధ్రులు సొంత ఊర్లకు పయనమవుతున్నారు. మంగళవారం రాత్రికల్లా అందరూ స్వగ్రామాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలకు చెందిన ఓటర్లు రెండు లక్షల మందికి పైగానే ఉన్నారు. ఉపాధి వేటలో వారు బెంగళూరులో స్థిరపడినప్పటికీ, ఎన్నికల సమయంలో స్వగ్రామాలకు వెళ్లి ఓట్లు వేసి రావడం ఆనవాయితీ.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో కూడా సీమాంధ్రలోని పలు జిల్లాలకు ముఖ్య నాయకులు స్థానిక అభ్యర్థులు పలుచుకు వచ్చి ప్రచారం చేయిస్తుంటారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగరంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. డాక్టర్ వైఎస్‌ఆర్ స్మారక ఫౌండేషన్, వైఎస్‌ఆర్ యువ వేదిక ఆధ్వర్యంలో నగరంలో ప్రవాసాంధ్రులు ఉన్న ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రవాసాంధ్రుల్లో సుమారు 75 శాతం మంది మహా నేత డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారే. వారంతా జగన్‌కు ఓటు వేయాలని పట్టుదలతో ఉన్నారు.
తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు ఎంతగా ప్రలోభ పెట్టినప్పటికీ వారు లొంగలేదు. జగన్‌కు ఓటు వేయాలనే ప్రగాఢ కాంక్షను నెరవేర్చుకోవడానికి అందరూ సొంత ఊర్ల బాట పడుతున్నారు. ప్రచారం సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు భక్తవత్సల రెడ్డి, కార్యదర్శి బత్తుల అరుణా దాస్, యువ వేదిక అధ్యక్షుడు ఎన్‌పీ. సురేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రసూల్‌లు మహా నేత చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జగన్ సారథ్యం అవసరాన్ని విడమరిచి చెప్పారు. ప్రచారంలో తమకు ప్రవాసాంధ్రుల నుంచి చక్కటి స్పందన వ్యక్తమైందని, జగన్‌కు ఓటు వేసి వస్తామని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా చెప్పారని భక్తవత్సల రెడ్డి, సురేశ్ కుమార్ తెలిపారు.