ముంబైలో సొంత ఇల్లు పగటి కలే అంటున్నారు బీఎంసీ అధికారులు.
సాక్షి ముంబై: ముంబైలో సొంత ఇల్లు పగటి కలే అంటున్నారు బీఎంసీ అధికారులు. నగరంలోని ఒకటిన్నర కోట్ల జనాభాలో కేవలం తొమ్మిది శాతం కుటుంబాల నెలసరి ఆదాయం సగటున రూ.60 వేలు ఉంటుంది. ప్రస్తుతం నగరంలో సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల ధర సుమారు రూ.14 లక్షల వరకు ఉంది. బొటాబొటిగా సర్దుకోవడానికి సరిపోయే సంపాదనతో మహానగరంలో సొంత ఇల్లు కొనుగోలు అనేది సామాన్యులకు సాధ్యమయ్యే పనికాదు. వచ్చే 20 సంవత్సరాల (2014 నుంచి 2034) కాలవ్యవధిలో నగర అభివృద్ధిపై బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధ్యయనం చేస్తోంది.
ఇందుకోసం ప్రణాళిక రూపొందించడానికి సేకరించిన వివరాల ద్వారా ఈ కఠిన వాస్తవం వెలుగుచూసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నేడు ప్రపంచంలోని ఖరీదైన నగరాల్లో ఒకటిగా నిలిచింది. 1991 నుంచి 2001 మధ్య దశాబ్ద కాలంలో జనాభాకు అనుగుణంగా ముంబై నగర విస్తరణ సాగలేదు. దీంతో ఇళ్ల కొరత ఏర్పడిందని విశ్లేషకులంటున్నారు. సామాన్య కుటుంబం వార్షిక ఆదాయం కన్నా ఇండ్ల ధర నాలుగు నుంచి ఐదు రెట్లు ఎక్కువగా ఉండడంతో కనీసం సింగిల్ బెడ్‌రూమ్ కూడా సామాన్యులు కొనుగోలు చేయలేరని ఆర్థిక నిపుణులంటున్నారు. నగరంలో 38 శాతం స్థలంలో నివాసాలు ఉన్నాయి. ఐదు శాతం వ్యాపారం, ఎనిమిది శాతం పారిశ్రామిక, 35 శాతం మౌలిక వనరుల వ్యవస్థ, మరో 16 శాతం స్థలాలు ఇతరత్రా కోసం ఉపయోగపడుతోంది.
ఇళ్లు కావాలంటే............
సామాన్యులకు సొంత ఇల్లు కల నెరవేరేందుకు ప్రభుత్వం తన పునరాభివృద్ధి ప్రాజెక్టుల నిబంధనల్లో సడలింపు తీసుకురావాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరకు లభించే ఇళ్లు, మౌలిక సదుపాయాలు, వేగవంతమైన రవాణా సేవలు అవసరం. కెనడా, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ లాంటి దేశాల మాదిరిగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టి సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో ఇళ్లను అందించే విధానం అవలంబించాలి. ప్రస్తుతం ముంబైలో 10 లక్షల ఇండ్ల కొరత ఉంది. ప్రైవేట్ సంస్థల అభివృద్ధి ప్రణాళికల వలన మధ్య, అధిక ఆదాయ వర్గాల వార్షిక ఆదాయ పెరగడంతో సంవత్సరానికి 15 వేల మంది ఇండ్లు కొనుగోలు చేస్తున్నారు.
ముంబై నగరంలో స్థిరాస్తుల ధరలు
చాలీ, మురికివాడల పునరాభివృద్ధి ప్రణాళిక అమలవుతున్న ప్రాంతాల్లో ఇండ్ల ధర రూ.20 నుంచి రూ.40 లక్షల వరకు ఉంది. మధ్యస్థాయి 1 బీహెచ్‌కె ఇల్లుకు ప్రాంతాన్ని బట్టి రూ.10 నుంచి రూ.85 లక్షల వరకు ఉంది. ఇక రెండు, మూడు పడక గదులతో కూడిన ఇండ్ల ధర రూ.65 లక్షల నుంచి రూ.2.5 కోట్లు ఉందని తెలుస్తోంది.
మురికివాడల్లో నివసించే వారి సంఖ్య
ముంబై మొత్తం విస్తీర్ణం 458.28 చదరపు కిలోమీటర్లు. పట్టణ ప్రాంతాల్లో 27.88 శాతం మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. అలాగే పశ్చిమ ఉపనగరాల్లో 42.69 శాతం, తూర్పు ఉపనగరాల్లో 51.99 శాతం మంది నివసిస్తున్నారు.