‘ఆమ్ ఆద్మీ’లా మంత్రులు
Published Tue, Dec 31 2013 12:53 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ మాదిరిగానే ఆప్ నేతలు సాదాసీదాగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల స్థాయిని మరిచి తాము సామాన్యులలో ఒకరిమే అన్నట్లు ప్రవర్తిస్తుండడంతో సచివాలయ సిబ్బంది ఖంగు తింటున్నారు. విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సోమవారం ఉదయం సచివాలయ సిబ్బంది సాధారణంగా ఆఫీసుకు వచ్చేవేళ కన్నా ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన తన గది వద్దకు వచ్చేసరికి మంత్రిత్వశాఖ సిబ్బంది కార్యాలయానికి రాలేదు. రవాణా శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సామాన్యులు సచివాలయంలోకి రావడానికి ఉపయోగించే గేట్ నంబర్ 6 మీదుగా లోపలికి వచ్చారు.
సామాన్యులు వాడే గేట్‌ను ఉపయోగించడం వల్ల భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, సచివాలయానికి రావడానికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోగలుగుతానని ఆయన అంటున్నారు. సాధారణంగా మంత్రులు వాడని గేట్‌ను సౌరభ్ భరద్వాజ్ వాడతాననడడంతో అధికారులు ఆ గేట్ వద్ద చెత్తను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కిందిస్థాయి ఉద్యోగులతో ఆ పనులు చేయిస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మెట్రోలో వ చ్చారు. ఆయన ఆదివారం ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్మికశాఖ మంత్రి గిరీష్ సోనీ సొంత కారులో, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రాఖీ బిర్లా ఆటోలో సచివాలయానికి వచ్చారు.
వీలైనంతవరకు ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగిస్తానని, అవసరమైతే అధికార వాహనాలను వినియోగిస్తాన ని రాఖీ బిర్లా చెప్పారు. ఆదివారం నిర్భయ వర్ధంతి నేపథ్యంలో రాఖీ బిర్లా రాత్రిపూట నగర రోడ్లపై భద్రతా పరిస్థితిని పరిశీలించారు. వసంత్‌విహార్, ఎయిమ్స్ బస్టాండ్లలో ప్రయాణికులు, ఆటోవాలాలతో మాట్లాడారు. డీటీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలని ఆటోవాలాలకు హితవు చెప్పారు. వసంత్ విహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసు సిబ్బందికి చీవాట్లు వేశారు. కన్నాట్‌ప్లేస్‌లో రాత్రివేళ చలిని తట్టుకోవడం కోసం చలిమంట కాగుతున్న పిల్లలతో ముచ్చటించారు.
Advertisement
Advertisement