న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిలీ ఓటర్ల గుట్టు రట్టు చేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నగరంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమ పార్టీకి చెందిన 11వేల మంది బూత్ ఇన్‌చార్జీలు, మూడువేల మంది పోలింగ్ స్టేషన్ ఇన్‌చార్జీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపింది. కొన్ని పార్టీలు బోగస్ ఓటర్ల పేర్లను నమోదు చేస్తున్నాయని, అదే సమయంలో ఆప్‌కు అనుకూలురైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని పార్టీ సీనియర్‌నాయకుడు మనీష్ సిసోడియా చెప్పారు.
అందువల్లనే నగరమంతటా ఈ సర్వేను నిర్వహిస్తున్నామని అన్నారు. బూత్ స్థాయిలో కనీసం ఇద్దరు పార్టీ కార్యకర్తలు ఓటర్ల పరిశీలన నిర్వహిస్తారని చెప్పారు. బీజేపీ ఇప్పటికే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆప్ ఓట్లను తొలగించి, బోగస్ ఓట్లను చేర్చాలని బీజేపీ నేతలు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశిం చారని చెప్పారు. తమ పరిశీలనలో బోగస్ ఓట్లను గుర్తిస్తే, వాటిని తొలగించేందుకు మాత్రమే కాదు, వాటిని నమోదు చేసిన అధికారులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తాము పట్టుబడతామని ఆప్ ఢిల్లీ విభాగం కన్వీనర్ అశుతోష్ చెప్పారు. తమదాకా రాక ముందే అధికారులు తమంతట తాము బోగస్ ఓట్లను గుర్తించి, వాటిని తొలగించాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్యేల అవినీతిపై ఆధారాలుంటే చెప్పండి
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడినట్లయితే ఆధారాలను జతచేసి ఫిర్యాదు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. తమ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలను బహిర్గతం చేసేందుకు తాము ప్రజల వద్దకే వెళ్లనున్నామని పేర్కొంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఏదైనా విశ్వసనీయమైన ఫిర్యాదు వస్తే దానిపై దర్యాప్తు జరుపుతామని, వచ్చే ఎన్నికల్లో అతనికి టికెట్ లభించేది లేనిదీ దానిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పార్టీ క్రమశిక్షణా కమిటీకి పంపుతామని, అక్కడ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారని పేర్కొంది. నిజానికి అవినీతి విషయంలో తమ ఎమ్మెల్యేలపై వేలెత్తి చూపే ఆస్కారమే లేదని పేర్కొంది.
బోగస్ ఓట్ల గుర్తింపునకు ఆప్ ఇంటింటి సర్వే
Published Sat, Nov 8 2014 11:53 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM