సాక్షి ముంబై: ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్నప్పటికీ వాటి ధరలు మాత్రం తగ్గడం లేదు. నవీముంబైలోని వాషి మార్కెట్‌కు ఇటీవల 60 టన్నుల ఉల్లిపాయలు దిగుమతి అయ్యాయి. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.40 నుంచి రూ.45 ధర పలుకుతున్నాయి. గతంలో ఉల్లి దిగుబడి తగ్గడంతో పాకిస్థాన్ నుంచి తెప్పించారు. అప్పట్లో వాటి ధర కిలో రూ.20 నుంచి రూ.25 వరకు పలికింది. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి వాషి మార్కెట్‌లోకి కరాచీ నుంచి ఉల్లిపాయలు వచ్చాయి. మరోవైపు వాషి మార్కెట్‌కుి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూర్, కర్ణాటకల నుంచి మొత్తం 84 వాహనాలు ఉల్లి లారీలు వచ్చాయి. బెంగళూర్ నుంచి తెప్పించిన ఉల్లిపాయలు కిలో రూ.40 నుంచి 45 చొప్పున విక్రయిస్తున్నారు.
చౌక దుకాణాలద్వారా అందజేయండి
చౌకధరల దుకాణాల ద్వారా ఉల్లిపాయలను చౌక ధరలకు అందజేయాలని సోషలిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉల్లి ధర రూ.100కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొరార్జీ దేశాయ్, వి.పి.సింగ్‌లు ప్రధానమంత్రులగా పనిచేసిన సమయంలో చౌకధరల దుకాణాలద్వారా ఉల్లిపాయలను ప్రజలకు విక్రయించారన్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల కారణంగా ప్రస్తుత పరిస్థితి దాపురించిందని ఆ పార్టీ కార్యదర్శి కమలాకర్ సుబేదార్, నాయకుడు సుధామ్ వాఘ్మారేలు ఆరోపించారు.
పనిచేసిన హెచ్చరిక మంత్రం
నాసిక్: నిల్వ చేస్తే దాడులు జరుపుతామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హెచ్చరిక మంత్రం బాగానే పనిచేసింది. దీంతో ఉల్లిపాయ ధరలు కిలోకి రూ. 10 మేర తగ్గాయి. మరోవైపు కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ని 38 శాతం పెంచుతామంటూ ప్రకటించడం కూడా కలిసొచ్చింది. దీంతో మార్కెట్‌లోకి దిగుమతి అవుతున్న ఉల్లి లారీల సంఖ్య పెరిగింది. దీంతో ఉల్లిపాయల ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉల్లిపాయల ధరలు అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) అధికారులతో సమావేశమైంది. ఉల్లిపాయలను ఎవరైనా చట్టవిరుద్ధంగా దాచిపెడితే దాడులు చేస్తామని హెచ్చరించింది.
దీంతో లసల్గావ్ మార్కెట్‌లో 17.31, పింపల్గావ్ మార్కెట్‌లో 22.73 శాతం తగ్గాయి. కాగా కర్ణాటక ఉల్లిపాయలు నగరంలోని మార్కెట్‌లలోకి రావడం ప్రారంభమైంది. దీంతో వీటి ధరలు మరింత తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
దిగుమతి చేసుకున్నా దిగని ధరలు
Published Sat, Sep 21 2013 12:24 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement
Advertisement