► కిరణ్‌బేడీపై వ్యతిరేకత
► శివకుమార్‌కు మద్దతు
► పొరబాటు జరిగినట్టు వివరణ
వాట్సాప్‌లో అశ్లీల వీడియో వ్యవహారం పుదుచ్చేరిలో రచ్చకెక్కింది. తమతో సంప్రదింపులు జరపకుండా పుదుచ్చేరి సివిల్ సర్వీసు అధికారిపై గవర్నర్ చర్యలు తీసుకోవడాన్ని మంత్రులు వ్యతిరేకించే పనిలో పడ్డారు. పొరబాటున ఆ మెసేజ్ వెళ్లిందే గానీ, పని గట్టుకుని గవర్నర్‌కు పంపించ లేదంటూ శివకుమార్‌కు మద్దతుగా గళం విప్పే వారి సంఖ్య పెరిగింది.
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి ప్రగతి లక్ష్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన అధికారాల మేరకు సరికొత్త సంస్కరణల బాటలో పయనిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారుల్ని ఏకం చేస్తూ వాట్సాప్ గ్రూప్‌ను రూపొందించారు. సహకార సంఘా ల రిజిస్ట్రార్ శివకుమార్ నెంబరు నుంచి ఆ గ్రూప్‌లోకి వెళ్లిన ఓ మెసేజ్ పెద్ద దుమారాన్నే రేపింది. అందులో అశ్లీల వీడియోలు ఉండడంతో గవర్నర్ ఆగ్రహానికి శివకుమార్ గురి కావాల్సి వచ్చింది. ఆయన్ను సీనియర్ ఎస్పీ రాజీవ్ రంజన్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సమాచారంతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల్లో ఆగ్రహం రేగింది.
వాట్సాప్ రచ్చ: తమతో సంప్రదింపులు జరపకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీనియర్ ఎస్పీపై మంత్రులు నమశ్శివాయం, షాజహాన్, కందస్వామి నేతృత్వంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శివాలెత్తి ఉన్నారు. పుదుచ్చేరి సివిల్ సర్వీసు పరీక్షల ద్వారా ఉన్నత పదవిలో ఉన్న అధికారిపై చర్యలు తీసుకోవాలంటే, ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని, అయితే, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శివకుమార్‌ను తమ వెంట తీసుకెళ్లి ఉన్నారు. ఈ సమాచారంతో రాజ్‌భవన్ వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. శివకుమార్‌పై ఆగమేఘాలపై కేసు నమోదు కావడంతో గవర్నర్ తీరుపై మంత్రులు శివాలెత్తే పనిలో పడ్డారు. ఇన్నాళ్లు పుదుచ్చేరిలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య సాగుతున్న అంతర్యుద్ధం తాజా రచ్చతో తెర మీదకు వచ్చినట్టు అయింది. గవర్నర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తే పనిలో పడ్డారు.
పొరబాటు: బాధ్యత గల పదవిలో ఉన్న ఉన్నతాధికారి పనిగట్టుకుని గవర్నర్‌కు మెసేజ్ పంపించేందుకు ఆస్కారం లేదన్న విషయాన్ని పరిగణించాలని శివకుమార్‌కు మద్దతుగా గళం విప్పే వాళ్లు పుదుచ్చేరిలో ఉండడం గమనార్హం. ఓ అధికారి ఈ విషయంపై మాట్లాడుతూ శివకుమార్ రాత్రి భోజనం చేస్తున్న సమయంలో వాట్సాప్‌కు వచ్చిన ఓ మెసేజ్‌ను చూసి, తక్షణం తన ఎడమ చేతితో డిలీట్ చేయడానికి ప్రయత్నించారని, అది కాస్త పొరబాటున గ్రూప్‌కు ఫార్వార్డ్ కావడంతోనే ఈ వివాదం తలెత్తినట్టుగా పేర్కొన్నారు. జరిగిన పొరబాటును భూతద్దంలో పెట్టి మరీ రచ్చకెక్కడం శోచనీయమంటూ గవర్నర్ తీరును దుయ్యబట్టే పనిలో పడ్డారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసే పనిలో మంత్రులు నిమగ్నమయ్యారు.
అధికారాల మేరకే: తాజా రచ్చ వ్యవహారంపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ తమ మంత్రులు ఎవ్వరూ సీనియర్ ఎస్పీతో దురుసుగా ప్రవర్తించలేదన్నారు. హఠాత్తుగా ఓ అధికారిని అదుపులోకి తీసుకుని ఉన్నట్టుగా వచ్చిన సమాచారంతో తమ మంత్రులు అక్కడికి వెళ్లారేగానీ, గవర్నర్‌కు వ్యతిరేకంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో మాత్రం కాదన్నారు. గవర్నర్ తన అధికారాల మేరకు పనిచేస్తున్నారని, ఇక, తాము తమకున్న అధికారాల మేరకు పనిచేస్తున్నామంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే పుదుచ్చేరిలో గవర్నర్, ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఏ పాటిదో స్పష్టం అవుతోంది.