► ఎట్టకేలకు స్పందన
► అన్నదాతకు అండగా చర్యలు
► ‘కరువు’ నివేదికకు ఆదేశాలు
► గ్రామాల్లోకి జిల్లా కలెక్టర్లు
►మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లతో ఉన్నత స్థాయి కమిటీ
►పదో తేదీ నాటికి నివేదిక సమర్పణ
సాక్షి, చెన్నై : అన్నదాతల ఆక్రందనలు, పదుల సంఖ్యలో బలవన్మరణాలు, ఆగుతున్న గుండె చప్పుడు వెరసి ఎట్టకేలకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కదిలించాయి. సీఎం పన్నీరు ప్రభుత్వంలో చలనం రావడంతో అన్నదాతలను ఆదుకునేందుకు తగ్గ తొలి అడుగు మంగళవారం పడింది. ఆందోళన వద్దన్న భరోసా ఇస్తూ, కరువు నివేదిక సమర్పణకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకుగాను, ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు, అన్ని విభాగాల మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌ల సమన్వయంతో ఉన్నత స్థాయి కమిటీ రంగంలోకి దిగనుంది. కొన్నేళ్లుగా రాష్ట్రం మీద నైరుతి రుతు పవనాలు శీత కన్ను వేయడం, ఈ ఏడాది ఈశాన్య రుతు పవనాలు సైతం ముఖం చాటేయడం వెరసి అన్నదాతలు కన్నీటి మడుగులో మునగాల్సిన పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. కళ్లెదుట ఎండుతున్న పంట, మొలకెత్తని విత్తనాలను చూసి అన్నదాతల గుండెలు పగులుతున్నాయి. ఆత్మహత్యల పర్వం ఊపందుకుంది.
ఇప్పటి వరకు ఎనభై మంది వరకు రైతులు విగత జీవులయ్యారు. మంగళవారం కూడా డెల్టాలో ఐదుగురు అన్నదాతల గుండెలు పగిలాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పదే పదే రైతు సంఘాలు, ప్రధాన ప్రతి పక్షంతో పాటు ఇతర పార్టీలు అన్నదాతల్ని ఆదుకునే విధంగా భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చినా ఫలితం శూన్యం. తాజాగా అన్నదాతల మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో పన్నీరు ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుంది. సచివాలయంలో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, ఎడపాడి పళనిస్వామి, తంగమణి, ఎస్‌పీ వేలుమణి, దురై కన్ను, ఆర్‌బీ.ఉదయకుమార్‌లతో పాటు ఆయా శాఖల కార్యదర్శులతో సీఎం పన్నీరు సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం అన్నదాతలకు తామున్నామన్న భరోసా ఇచ్చే విధంగా స్పందిస్తూ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
పన్నీరు భరోసా : అన్నదాతల్లో నెలకొన్న ఆందోళనను తొలగించే విధంగా సీఎం పన్నీరు సెల్వం భరోసా ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది నైరుతి రుతు పవనాలతో పాటు ఈశాన్య రుతు పవనాల ప్రభావం కన్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు 440 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉందని, అయితే, ఈ సారి కేవలం 168 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసినట్టు వివరించారు. డెల్టాలో 12.86 లక్షల ఎకరాల్లో సంబా సాగుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇందులో 11.01 లక్షల ఎకరాల పంటను బీమా చేసినట్టు వివరించారు.
రాష్ట్రం కరువుతో తల్లడిళ్లుతుండడాన్ని పరిగణలోకి తాము తీసుకునే అవకాశం ఉన్నా, అందుకు తగ్గట్టు కేంద్రం విధించిన నిబంధనల మేరకు పరిశీలన సాగాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో పంట నష్టం వివరాలను నివేదిక రూపంలో కేంద్రం ముందు ఉంచి, అందుకు తగ్గ నష్ట పరిహారం రాబట్టడం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నష్టపరిహారంతో అన్నదాతల్ని ఆదుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం నిర్ణయించినట్టు ప్రకటించారు. ఈ ప్రక్రియను సాగించేందుకు చెన్నై మినహా తక్కిన 31 జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో బృందాలు ఈనెల తొమ్మిదో తేదీ వరకు గ్రామాల్లో పర్యటించి, నివేదికను పదో తేదీన ప్రభుత్వానికి సమర్పించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రకటించారు. సంక్రాంతిని పురస్కరించుకుని కుటుంబ కార్డు దారులందరికీ పొగల్ వస్తువుల్ని కానుకగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు ప్రకటించారు. పన్నీరు భరోసాను రైతు సంఘాలు ఆహ్వానించాయి. ఈనెల ఐదో తేదీ నుంచి చేపట్ట దలచిన ఆందోళనల్ని విరమించుకున్నాయి.
నేడు కెబినెట్ మీటింగ్ : రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి సీఎం పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సచివాలయం వేదికగా మంత్రి వర్గం భేటీ కానుంది.