ఒకేరోజు 1.7 లక్షల దరఖాస్తులు
Published Mon, Mar 10 2014 10:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో వచ్చే నెల 10న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఢిల్లీ ఎన్నికల సంఘం నగరవ్యాప్తంగా ఆదివారం ఏర్పాటు చేసిన 11,763 ప్రత్యేక శిబిరాల్లో 1.7 లక్షల మంది ఓటరు నమోదు దరఖాస్తులు సమర్పించారు. ఇది వరకే ఓటర్లుగా నమోదైన వాళ్ల వివరాలనూ ఈ సందర్భంగా తనిఖీ చేసుకునే అవకాశం కల్పించారు. ఇలాంటి వారికి సహకరించడానికి బూత్‌స్థాయి అధికారులను (బీఎల్‌ఓ) నియమించామని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటర్లు తమ వివరాలను తనిఖీ చేసుకునేందుకు వీలుగా జాబితాను అంటించారు. అందులో పేర్లు లేని వాళ్లు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు ఫారం నంబరు 6 ఇచ్చారు.
బుధవారం దాకా ఈ ఫారాలను సమర్పించవచ్చు. శ్రీ వెంకటేశ్వర కాలేజీలో అంటించిన ఓటర్ల జాబితా, ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయ సీనియర్ అధికారులు ఈ శిబిరాలను పర్యవేక్షించారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ సైతం హనుమాన్‌రోడ్డు, లోధీ ఎస్టేట్, పండారా రోడ్డు, ఆర్కే పురం పోలింగ్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓటర్ల పేర్ల పరిశీలన, ధ్రువీకరణతోపాటు కొత్త ఓటర్ల నమోదుకు కూడా శిబిరాల్లో అవకాశం కల్పిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి ఆషిమా జైన్ అన్నారు. మధ్యజిల్లా ఎన్నికల కార్యాలయం 1,056 పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని వివరించడానికి పాతఢిల్లీ ప్రాంతంలో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమలనూ నిర్వహించారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునేవారి సంఖ్యను మరింతగా పెంచి, గత రికార్డులను తిరగరాస్తామని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి విజయ్‌దేవ్ ఇటీవల ప్రకటించారు. నగరంలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికల్లో 1.20 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించే అన్ని చర్యలను తీసుకుంటున్నామని, తద్వారా గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 65.86 పోలింగ్ శాతాన్ని ఈసారి అధిగమిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. జనవరి 31 నాటికి ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నవారి సంఖ్య 1,20,60,493కు చేరిందన్నారు. ఇందులో పురుషుల సంఖ్య 66,84,476 ఉండగా, మహిళల సంఖ్య 53,76,017 మంది ఉన్నారని, ఇందులో 638 మంది లింగమార్పిడి చేసుకున్నవారు ఉన్నారని చెప్పారు. ఢిల్లీ ఓటర్లలో స్త్రీ, పురుష నిష్పత్తి 804:1000 గా ఉందని, మొత్తం జనాభాలో ఓటర్ల సంఖ్య 68.12 శాతం ఉందని దేవ్ అన్నారు.
Advertisement
Advertisement