ఖాకీ కీచకులు
Published Thu, Apr 24 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM
న్యూఢిల్లీ: తనతోపాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌కు నీలి చిత్రాలు చూపించడం, అశ్లీల పదజాలంతో ధూషించడం, లైంగికంగా వేధించడం వంటి నేరాలకు పాల్పడ్డ పోలీసులపై 62 కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ఏసీపీ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టు వెల్లడయింది. 2003 నుంచి 2013 వరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఎనిమిది కేసుల్లో నిందితులు విడుదల కాగా, మరో ఎనిమిది కేసుల్లో అభియోగాలు నిరూపితం కాలేదు. మరో కేసులో ఏసీపీ బలవంతంగా పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమర్పించిన దరఖాస్తుకు ప్రతిగా ఢిల్లీ పోలీసు సెక్యూరిటీ విభాగం ఈ వివరాలను వెల్లడించింది. పోలీసులు తమను లైంగికంగా వేధించినట్టు గుర్తుతెలియని మహిళలు చేసిన ఫిర్యాదులపైనా విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి.
అయితే 2003-2006 మధ్య నమోదైన కొన్ని కేసుల రికార్డులు తమ వద్ద అందుబాటులో లేవని సెక్యూరిటీ బ్రాంచ్ వివరణ ఇచ్చింది. కింగ్స్‌వే క్యాంప్‌లోని ఢిల్లీ సాయుధ పోలీసు విభాగం కార్యాలయంలో పనిచేసే ఏసీపీపై 2009లో లైంగిక వేధింపుల కేసు నమోదయింది. దీనిపై విచారణ నిర్వహించిన కేంద్ర హోంశాఖ అధికారులు సదరు ఏసీపీ తప్పు చేసినట్టు నిర్ధారించారు. దీంతో పదవీ విరమణ చేయాల్సిందిగా అతణ్ని ఆదేశిస్తూ గత ఏడాది జనవరి 21న ఉత్తర్వులు జారీ అయ్యాయి. సహోద్యోగి తరచూ నీలిచిత్రాలు చూపిస్తూ బూతులు తిడుతున్నాడంటూ మహిళా కానిస్టేబుల్ గత ఏడాది పోలీసు కంట్రోల్ రూమ్ (పీసీఆర్)కు ఫిర్యాదు చేసింది.
దీనిపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులు తమపై దురుసుగా ప్రవర్తించడమేగాక, లైంగికంగానూ వేధిస్తున్నారంటూ గుర్తుతెలియని మహిళా పోలీసు ఉద్యోగులు కొందరు పీసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసుల విచారణ ఇంకా పూర్తి కాలేదని పోలీసుశాఖ తెలిపింది. పశ్చిమజిల్లాలో అత్యధికంగా 13, వాయవ్య జిల్లాలో 12 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. అయితే వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆర్టీఐ చట్టం 81 (జె) సెక్షన్ ప్రకారం సదరు సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని భావించిన సందర్భంలో సమాచారం ఇవ్వకుండా నిలిపి వేసే అధికారం ఈ చట్టం ప్రకారం సంస్థలకు ఉంటుంది.
Advertisement
Advertisement