వారసుడొచ్చాడు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారుకు వారసుడొచ్చాడు. నమ్మకానికి, విశ్వాసానికి పాత్రుడిగా ఉన్న ఓ పన్నీరు సెల్వంకు మళ్లీ పట్టం కడుతూ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. రెండో సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు పన్నీరు సెల్వం సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలితకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడటం ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది. జైలు శిక్షను ఎదుర్కొంటున్న జయలలిత తన ఎమ్మెల్యే, సీఎం పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి అనివార్యమైంది. దీంతో జయలలిత వారసుడిగా సీఎం పగ్గాలు చేపట్టేదెవరోనన్న చర్చ రాష్ర్టంలో బయలు దేరింది. పలువురి పేర్లు తెర మీదకు వచ్చినా, చివరకు నమ్మకం, విశ్వాసానికి పాత్రుడిగా ఉన్న ఓ పన్నీరు సెల్వంకు తన బాధ్యతల్ని అప్పగించేందుకు జయలలిత సిద్ధమయ్యారు. ఉదయాన్నే ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో నలుగురు మంత్రులు పరప్పన అగ్రహారం చెరలో ఉన్న జయలలితతో భేటీ అయ్యారు.
అక్కడి నుంచి ఆగమేఘాలపై చెన్నైకు చేరుకున్న ఈ మంత్రుల బృందం పార్టీ శాసన సభా పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ముందుగానే చెన్నైకు చేరుకున్న ఎమ్మెల్యేలందరూ పార్టీ కార్యాలయానికి పరుగులు తీశారు. వారసుడొచ్చాడు: జయలలిత వారసుడిగా పలువురి పేర్లు తెర మీదకు రావడంతో కాబోయే సీఎం ఎవరన్న ఉత్కంఠ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లోను నెలకొంది. జయలలిత సూచించే వ్యక్తే తమ సీఎం అని స్పష్టం చేసిన ఎమ్మెల్యేలు, చివరకు జయలలితకు విశ్వాస పాత్రుడైన, పార్టీ కోశాధికారి, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వంకు పట్టం కట్టడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. జయలలిత ఆదేశాల మేరకు పార్టీ శాసన సభాపక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పార్టీ కార్యాలయం నుంచి పన్నీరు సెల్వం బయటకు వచ్చారు. అక్కడి నుంచి నత్తం విశ్వనాథన్, ఎడపాడి పళని స్వామి, వైద్య లింగంలతో కలసి జయలలిత నివాసం పోయేస్ గార్డెన్‌కు బయలు దేరారు. కాసేపు అక్కడ గడిపినానంతరం నేరుగా రాజ్ భవన్‌కు బయలు దేరారు.
గవర్నర్‌తో భేటీ : సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు రాజ్ భవన్‌కు ఓ పన్నీరు సెల్వం చేరుకున్నారు. అన్నాడీఎంకే శాసన సభా పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని గవర్నర్‌కు వివరించారు. పార్టీ శాసన సభా పక్ష తీర్మానాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తనను శాసన సభా పక్ష నేతగా పార్టీ ఎన్నుకున్న దృష్ట్యా, తన నేతృత్వంలో మంత్రి వర్గం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని విన్నవించారు. చివరకు పన్నీరు సెల్వం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమోదం తెలియజేస్తూ రాష్ర్ట గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆహ్వానం పలికారు. నమ్మకానికి ప్రతీక ఓపీ: అన్నాడీఎంకేలో ఎందరో నేతలు ఉన్నా, ఓ పన్నీరు సెల్వంకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది. రైతుగా, అన్నాడీఎంకేలో కార్యకర్తగా ఎదిగిన ఓ పన్నీరు సెల్వంకు రాజకీయ పయనంలో తిరుగు లేదని చెప్పవచ్చు.
ఎంజీయార్ మరణానంతరం ఆయన సతీమణి జానకి గ్రూపులో చేరినా, చివరకు ఆమె విధానాలు నచ్చక బయటకు వచ్చారు. జయలలితకు అప్పట్లో అండగా నిలబడ్డ నాయకుల్లో అత్యంత విశ్వాస పాత్రుడిగా పన్నీరు సెల్వం పేరు గడించారు. 1996లో పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాక వెను తిరిగి చూసుకోలేదు. 2001లో తొలి సారిగా తాను పుట్టిన గడ్డ పెరియకుళం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తొలి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన ఆయనకు జయలలిత మంత్రి వర్గంలో చోటు ద క్కడం గమనార్హం.
అదే సమయంలో టాన్సీ కేసులో జయలలిత జైలుకు వెళ్లాల్సి రావడంతో విశ్వాస పాత్రుడి అరుున పన్నీర్ సెల్వంను సీఎం పదవి వరించింది. 2001 సెప్టెంబరు నుంచి 2002 మార్చి వరకు తనకు జయలలిత అప్పగించిన బాధ్యతల్ని, తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎంగా పన్నీరు సెల్వం విధుల్ని నిర్వర్తించారు. ఈ నమ్మకం పన్నీరు సెల్వం ఉన్నతికి మరింతగా దోహద పడింది. 2006లో అధికారాన్ని కోల్పోయిన సమయంలో తన ప్రతినిధిగా అసెంబ్లీలో ప్రధాన ప్రతి పక్ష నేతగా పన్నీరు సెల్వంను జయలలిత కూర్చోబెట్టారు. మూడో సారిగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాక, ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవికి అప్పగించడంతో పాటుగా పార్టీ పరంగా కోశాధికారిని చేశారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా, పన్నీరు సెల్వంతో జయలలిత చర్చిస్తుంటారు. అయితే, ఆ వివరాలు ఏ మాత్రం బయటకు పొక్కేవి కాదు. అందుకే ఆ నమ్మకం మళ్లీ సీఎం పీఠంపై పన్నీరు సెల్వంను కూర్చోబెట్టనుందని చెప్పవచ్చు.