విదిలింపులే
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ కోసం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను లోక్‌సభ బుధవారం చర్చించి, ఆపై ఆమోదించింది. రాష్ట్రపతి పాలన కొనసాగుతుండంతో జైట్లీ గత నెల రూ. 36,776 కోట్ల వ్యయంతో కూడిన ఢిల్లీ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బుధవారం మధ్యాహ్నం లోక్‌సభ సభ్యులు దీనిపై చర్చించి ఆమోదించారు. ఢిల్లీకి చెందిన బీజేపీతోపాటు అన్ని పార్టీల ఎంపీలు ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు దీనిని ఎన్నికల బడ్జెట్‌గా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున దీపేందర్‌సింగ్‌హూడా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కేటాయింపులనే జైట్లీ చాలామటుకు తన బడ్జెట్‌లో తిరిగి ప్రతిపాదించారని ఆరోపించారు.
విద్యుత్ చార్జీలను తగ్గించకపోవడాన్ని తప్పుబట్టారు. విద్యుత్‌పై 30 శాతం సబ్సిడీ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీజేపీ ...ఈ బడ్జెట్‌లో కేవలం రూ. 260 కోట్ల సబ్సిడీని కల్పించిందంటూ విమర్శించారు. అన్నశ్రీ యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఇచ్చే రూ. 600 పింఛన్‌ను కూడా ఉపసంహరించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ గద్దె దిగినప్పటినుంచి అరాచకం నెలకొందని ఆయన ఆరోపించారు. ఢిల్లీవాసుల కలలను నిజం చేయనట్లయితే బీజేపీకి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ ఆరోపణలపై న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖి స్పందిస్తూ హర్యానాకు చెందిన పార్లమెంట్ సభ్యుడితో బడ్జెట్‌పై చర్చ జరిపించాల్సిన గతి కాంగ్రెస్‌కు పట్టిందని ఎద్దేవా చేశారు. మహిళలకు భద్రత, విద్యుత్ సరఫరాను మెరుగుపరచడం, పేదలకు చవక ధరకు గృహాలను కేటాయించడంపై దృష్టి పెట్టిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన భువనగిరి నియోజకవర్గ సభ్యుడు ఈ బడ్జెట్‌పైజరిగిన చర్చలో పాల్గొంటూ.... దేశ రాజధాని నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణించారు. అన్ని రాష్ట్రాల సంస్కృతిని ఢిల్లీలో ప్రతిబింబించేవిధంగా చేయడం కోసం ఇంటర్‌సెక్షన్లు, ఫ్లైఓవర్లపై విభిన్న రాష్ట్రాలకు చెందిన ప్రతీకలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కాగా అరుణ్‌జైట్లీ బడ్జెట్ కేటాయింపులను సమర్థించుకున్నారు.
రెండు నగరాల కలయిక ఢిల్లీ అని ఆయన పేర్కొన్నారు. ఒకటి అత్యాధునిక సౌకర్యాలున్న ప్రపంచస్థాయి నరగం కాగా రెండోది కనీస సదుపాయాలు కూడా లేనిదని అన్నారు. రెండో ఢిల్లీలో నివసించే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన చెప్పారు. వైద్య సదుపాయాలను మెరుగుపరచడం కోసం దక్షిణ ఢిల్లీలో అత్యాధునిక ఆస్పత్రిని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. 50 డయాలిసిస్ సెంటర్లను, 110 అంబులెన్స్‌లను కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు ఆయ న తెలిపారు. కొత్త గా 20 పాఠశాలల ఏర్పాటుతోపాటు బాలికల కోసం ఉన్నత పాఠశాలలను నెలకొల్పడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయన్నారు. అనధికార కాలనీలలో సౌకర్యాల కల్పన, నగరంలో సీవేజ్‌తోపాటు నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, యమునా నదిలో కాలుష్యం తొలగింపుపై తమ బడ్జెట్‌లో దృష్టి సారించామన్నారు. మెట్రోను విస్తరించడంతో పాటు కొత్తగా మరిన్ని లో ఫ్లోర్ బస్సులు, క్లస్టర్ బస్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు.