సిలికాన్ సిటీలో రోగుల అవస్థలను కార్పొరేట్ ఆస్పత్రులు కాసులుగా మార్చుకుంటున్నాయి. అవసరం వారిది, ఎంతైనా బిల్లు చెల్లిస్తారనే ఆలోచనతో లక్షలకు లక్షలు బాదుతున్నారు.
బనశంకరి: కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగికి చికిత్స అందించడానికి 10 రోజులకు రూ.9.09 లక్షలు బిల్ అవుతుందని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి స్పష్టం చేసింది. దీంతో రోగి బంధువులు కళ్లు తేలేశారు. వివరాలు.. 67 ఏళ్ల కోరమంగల వాసి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు వైట్‌పీల్డ్‌లో ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రోగిని పరిశీలించిన డాక్టర్లు 10 రోజులు చికిత్స చేయాలి, రూ.9.09 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. అది విన్న కుటుంబసభ్యులు హడలిపోయి ఆసుపత్రిలో చేర్పించలేమని చెప్పేశారు.
షాక్ తిన్నాం: బంధువులు
రోగి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితం కోసం వేచి చూస్తున్నామని, సోమవారం శ్వాసతీసుకోలేకపోవడంతో మేము కొలంబియా ఏషియా ఆసుపత్రికి తీసుకువచ్చామని, వైద్యులు ఇంత ఖర్చవుతుందని చెప్పారని వివరించారు. అది విని షాక్‌కు గురయ్యామని తెలిపారు. తరువాత ఓ స్వచ్ఛంద సేవాసంస్థవారితో మాట్లాడగా తక్కువ ఫీజులతో వైద్యం చేసే మరో ఆస్పత్రి గురించి చెప్పారని, అక్కడ మేము రూ.25 వేలు చెల్లించి చేర్పించామని చెప్పారు. వైద్యం పేరుతో రోగుల దుస్థితిని లాభంగా వినియోగించుకోరాదని వారు హితవు పలికారు. ఈ తతంగంపై వైద్య విద్యా మంత్రి సుధాకర్ మాట్లాడుతూ ఆ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక కొలంబియా ఏషియా ఆసుపత్రి మేనేజర్ మాట్లాడుతూ రోగి తీవ్రమైన జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. సుగర్, బీపీ ఉన్నాయి. తక్షణం చికిత్స అందించే అవసరం ఉంది. కరోనా ఉందో లేదో తెలియరాలేదు. ఇలాంటి పరిస్థితిలో చికిత్సకు ఎంత ఖర్చవుతుందో ముందే తెలిపాము. ఇదే ఫైనల్ బిల్లు కాదు అని చెప్పారు.
ఇదీ బిల్లు
వెంటిలేటర్ రూ.1.40 లక్షలు, రూ.3 లక్షలు ఔషధాలు, ల్యాబ్ పరీక్షలకు రూ.2 లక్షలు, రూమ్ అద్దె రూ.75 వేలు, నర్సింగ్ చార్జ్‌లు రూ.58,500, రేడియోలజీ, ఫిజియోథెరపీకి రూ.35,000, సర్జికల్ సామగ్రికి రూ.25,000 అవుతుందని బిల్ చూపారు.
Comments
Please login to add a commentAdd a comment