► కసరత్తుల్లో చిన్నమ్మ న్యాయవాదులు
► ఆ కేసు ఖర్చు రూ.12 కోట్లు
► టీఎన్ కు త్వరలో కర్ణాటక లేఖ
► మనో వేదన, అనారోగ్య సమస్య
► శిక్ష అనుభవించాల్సిందే :మార్కండేయ కట్జు
సాక్షి, చెన్నై: పరప్పన అగ్రహార చెర నుంచి తమిళనాడులోని ఏదో ఒక జైలుకు చిన్నమ్మ శశికళను మార్చేనా? అన్న చర్చ బయలు దేరింది. ఇందుకు తగ్గ కసరత్తుల్లో న్యాయవాదులు సెంథిల్, అశోకన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, అక్రమాస్తుల కేసు ఖర్చు రూ. 12 కోట్లుగా కర్ణాటక సర్కారు తేల్చింది. ఈమొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తగ్గ చర్యల్లో అక్కడి అధికారులు ఉన్నట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి,సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ, ఇలవరసి ఒకే గదిలో ఉన్నారు.
శుక్రవారం వేకువజామున శశికళ ధ్యానం చేసినట్టు, అల్పాహారంగా పులిహోర, మధ్యాహ్నం రాగి సంగటి స్వీకరించినట్టు జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, రాత్రికి చపాతీతో పాటు పండ్లు సిద్ధం చేశారు. చిన్నమ్మకు మధుమేహం ఉండడంతో అందుకు తగ్గ మాత్రలు తీసుకున్నట్టు, మోకాలి నొప్పి తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో ఆయుర్వేద మందుల్ని తీసుకున్నట్టు సమాచారం. ఆమెకు ఎలాంటి వసతులు లేని దృష్ట్యా, నేల మీద నిద్రకు ఉపక్రమించక తప్పడం లేదని తెలుస్తోంది. బెంగళూరు చెరలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండడంతో, శిక్షను తమిళనాడులోని ఏదేని ఒక జైల్లో అనుభవించే విధంగా ప్రత్యేక వ్యూహాన్ని రచించే పనిలో ఆమె తరఫు న్యాయవాదులు నిమగ్నమైనట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు.
చెన్నై లేదా వేలూరు, లేదా కోయంబత్తూరు కేంద్ర కారాగారాల్లో ఒక దానిని ఎంపిక చేసి, ఆమెను జైలు మార్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని న్యాయవాదులు సెంథిల్, అశోకన్ వేగవంతం చేసినట్టు సమాచారం. ఈ ఇద్దరు చిన్నమ్మ శశికళతో సంప్రదింపులు జరిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బల పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గిన క్షణాల్లో ఇందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేస్తూ కోర్టును ఆశ్రయించేందుకు కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నట్టు తెలిసింది. దీంతో చిన్నమ్మను తమిళనాడులోని జైలుకు మార్చేనా అన్న చర్చ ఊపందుకుంది. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన పక్షంలో, ఇక అన్నాడీఎంకే వర్గాలతో పరప్పన అగ్రహార చెర పరిసరాలు కిక్కిరిసే అవకాశాలు ఎక్కువే. ఇది కాస్త అక్కడి అధికార యంత్రాంగానికి ఇబ్బంది కరమే.
రూ.12 కోట్లు : అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు పెట్టింది. 2004 నుంచి 2016 వరకు ఈ కేసు విచారణ బెంగళూరు కోర్టులో సాగిన విషయం తెలిసిందే. తొలుత సిటీ సివిల్ కోర్టులో, తదుపరి అక్కడి హైకోర్టులో, చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. 2004 నుంచి సిటీ సివిల్ కోర్టులో జరిగిన విచారణకు రూ. 2.86 కోట్లు, హైకోర్టులో జరిగిన విచారణకు రూ. 6.68 కోట్లు, పలు శాఖలకు మరో రూ. 3.78 కోట్లు ఖర్చును కర్ణాటక ప్రభుత్వం వెచ్చించింది. ఇక, భద్రతా ఏర్పాట్ల కోసం రూ.70 లక్షలకు పైగా మొత్తం 12 లక్షలు ఖర్చు జరిగినట్టు అక్కడి గణాంకాల విభాగం తేల్చింది. ఈ మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తగ్గ చర్యల్లో ఉన్నట్టు సమాచారం.
ఇందుకు సంబంధించి త్వరలో తమిళనాడు ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కేసుల విచారణకే లెక్కల్ని ప్రకటించిన కర్ణాటక సర్కారు, ఇక రాష్ట్రంలో చిన్నమ్మ రిమోట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరెంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందేమో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలను పరిగణించి బల పరీక్షలో పళనిస్వామి నెగ్గగానే, చిన్నమ్మ చెర మార్చే విషయంగా కసరత్తుల వేగం పెరగడం ఖాయం అన్నది స్పష్టం అవుతోంది. ఇక, ఈ విషయంగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ను కదిలించగా, ఎక్కడ ఉన్నా, చిన్నమ్మ తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తారని వ్యాఖ్యానించారు. జైలు మార్పు విషయంగా ప్రస్తుతానికి చర్యలు తీసుకోలేదని దాట వేశారు.
శిక్ష అనుభవించాల్సిందే : నాలుగు సంవత్సరాల పాటుగా శశికళ జైలు శిక్షను అనుభవించాల్సిందేనని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కర్జు పేర్కొన్నారు. తిరుచ్చిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పీలుకు వెళ్లే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదన్నారు. పునస్సమీక్షకు మళ్లీ వెళ్లవచ్చన్నారు. పునస్సమీక్ష పిటిషన్లు అనేకం ఇప్పటి వరకు తిరస్కరణకు గురై ఉన్నాయని వివరించారు. నాలుగేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరు నెలల తర్వాత పళని స్వామి ప్రభుత్వం గురించి స్పందించగలమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పన్నీరుకు ప్రజా మద్దతు పుష్కలంగా ఉందని, అయితే, ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడాన్ని పరిగణించాల్సి ఉందన్నారు.