రాజ్యసభలో మాట్లాడుతున్న మోదీ
• స్కాంల హయాంలోనూ అవినీతి మచ్చ పడలేదు
• మాజీ ప్రధానిపై మోదీ విసుర్లు
• నోట్ల రద్దుపై విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని
• కాంగ్రెస్ అభ్యంతరం.. సభ నుంచి వాకౌట్
న్యూఢిల్లీ: నోట్ల రద్దును లూటీ, దోపిడీ అని ఇటీవల రాజ్యసభలో తీవ్రంగా విమర్శించిన మాజీ ప్రధాని మన్మోహన్‌పై ప్రధాని మోదీ అదే సభ సాక్షిగా తీవ్రమైన ఎదురుదాడి చేశారు. ఎంత అవినీతి జరిగినా మచ్చపడకుండా చూసుకోవడం ఆయనకే చెల్లిందని వ్యంగ్య బాణాలు సంధించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో ప్రసంగించిన మోదీ నోట్ల రద్దును సమర్థించుకుంటూ మన్మోహన్, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
‘స్వాతంత్య్రం వచ్చాక 70 ఏళ్లలో సగం కాలం..అంటే 35 ఏళ్లపాటు సాగిన ఆర్థిక వ్యవహారాలపై ఆయనకు గట్టి పట్టు ఉంది. ఆర్థిక నిర్ణయాల్లో ప్రత్యక్ష అనుబంధం ఉంది.. ఆర్థిక రంగంలో ఇలాంటి వ్యక్తి బహుశా మరొకరు ఉండరు. ఎన్నో కుంభకోణాలు జరిగాయి. రాజకీయ నేతలమైన మనం మన్మోహన్ అనుభవం నుంచి చాలా నేర్చుకోవాలి. ఎంతో జరిగింది.. కానీ ఆయనపై ఒక్క మచ్చా పడలేదు. రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేసే కళ ఒక్క డాక్టర్ సాబ్‌కే తెలుసు’ అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. ‘మీరు మర్యాద తప్పితే సమాధానం వినే దమ్ము మీకుండాలి.
బదులు తీర్చుకునే సత్తా మాకుంది. మర్యాద, రాజ్యాంగ హద్దుల్లోనే ఆ పని చేస్తాం. అంత ఉన్నతమైన పదవి(ప్రధాని) చేపట్టిన వ్యక్తి లూటీ, దోపిడీ అని సభలో మాట్లాడారు. వారు(కాంగ్రెస్) అలాంటి పదాలు వాడేముందు 50 సార్లు ఆలోచించి ఉండాల్సింది..’ అని మోదీ అన్నారు. నోట్ల రద్దు వ్యవస్థీకృత నేరం, చట్టబద్ధ దోపిడీ, భారీ వైఫల్యం అని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో మన్మోహన్ అనడం తెలిసిందే. దీన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ‘మన్మోహన్‌జీ ఇక్కడ ప్రసంగించారు.
మన్మోహన్ ముందుమాట రాసిన ఒక పుస్తకం ఇటీవల విడుదలైంది. ఆయన ప్రముఖ ఆర్థికవేత్త కనుక అందులో ఆయన కృషి ఉంటుందని మొదట భావించాను. అయితే ఆ పుస్తకం వేరొకరు రాసిందని, ముందుమాట మాత్రమే మన్మోహన్ రాశారని వెంటే గుర్తుకొచ్చింది. ఆయన ప్రసంగమూ అలాంటిందే’ అని అన్నారు. మోదీ ప్రసంగ సమయంలో మన్మోహన్ సభలోనే ఉన్నారు.
నేను 10 మంది పేర్లను చెప్పగలను
నోట్ల రద్దును వ్యతిరేకించిన ఆర్థికవేత్తల పేర్లను కాంగ్రెస్ ప్రస్తావించగా మోదీ బదులిస్తూ.. ‘మీరు పదిమందిని ఉటంకిస్తే నేను 20 మంది పేర్లు చెప్పగలను. ప్రపంచంలో ఇలాంటిది(నోట్ల రద్దు)ఎన్నడూ జరగలేదు ఇదొక అధ్యయన అంశం అవుతుంది’ అని అన్నారు. మాజీ హోం శాఖ కార్యదర్శి మహదేవ్ గోద్బోలే రాసిన పుస్తకంలో 1971లో నోట్ల రద్దుచేయనందుకు ఇందిరపై విమర్శలున్నాయన్నారు. ‘నల్లధనం, అవినీతిపై పోరాటం రాజకీయ పోరాటం కాదు. ఇది అందరి బాధ్యత. ’ అని అన్నారు.
ఆర్‌బీఐ గవర్నర్‌ను లాగడమెందుకు?
‘నన్ను, ప్రభుత్వాన్ని విమర్శించండి. ఆర్‌బీఐని, దాని గవర్నర్‌ను ఎందుకు ఇందులోకి లాగుతారు? ’ అని మోదీ అన్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్‌బీఐ విషయాల్లో జోక్యం చేసుకునేవారని అన్నారు. 1972లో నోట్ల రద్దును జ్యోతి బసు సమర్థించారంటూ వామపక్షాలు తనతో కలసి రావాలని కోరారు. నోట్ల రద్దు తర్వాత దేశంలో 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. మోదీ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కొన్ని విపక్షాలూ వారిని అనుసరించాయి. మొత్తం 651 సవరణలూ వీగిపోయాయి.
ముందుచూపు లేని బడ్జెట్:విపక్షం
లోక్‌సభలో బుధవారం కోరమ్ లేక సభాకార్యక్రమాల కాసేపు ఆగిపోయాయి. తర్వాత సభ్యులు రాగానే కేంద్ర సాధారణ బడ్జెట్‌పై చర్చ మొదలైంది. బడ్జెట్‌లో ముందుచూపు కొరవడిందని, సామాన్యులకు, దేశానికి ఒరిగేదేమీ లేదని విపక్షం ఆరోపించింది. నోట్ల రద్దు విషయంలో మోదీ పాకిస్తాన్ దారిలో సొంత ప్రజలపై సర్జికల్ దాడులు చేశారని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ మండిపడ్డారు. రాజ్యసభలో మన్మోమహన్‌పై మోదీ చేసిన విమర్శలు ఘోరంగా ఉన్నాయని, ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కాంగ్రెస్ ఆక్షేపించింది. చర్చను మోదీ దిగజార్చారని,∙సభకు క్షమాపణ చెప్పాలంది.