సాక్షి, ముంబై: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగించేందుకు నగర పోలీసు యంత్రాంగం ఇప్పటినుంచి సన్నద్ధమవుతోంది. నేర చరిత్ర ఉన్నవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోంది. ముఖ్యంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటికి సంబంధించిన జాబితా రూపొందించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎన్నికల సమయంలో అడ్డంకులు సృష్టించే అసాంఘిక శక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై త్వరలో ఓ సమావేశం ఏర్పాటుచేసి చర్చించనున్నారు.
నగరంలో ఎక్కడెక్కడ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి.., అత్యంత సమస్యాత్మక నియోజక వర్గాలెన్ని ఉన్నాయనే విషయాలు ఆరా తీస్తున్నారు. గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో, ఏ పోలింగ్ కేంద్రం వద్ద అల్లర్లు జరిగాయి..? బోగస్ ఓటింగ్ ఎక్కడ జరిగింది..? డబ్బుల పంపిణీ ఎక్కడ జరిగింది...? వంటి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ ప్రకారం వచ్చే నెలలో మూడు విడతల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అదనపు భద్రత దళాలను సమకూర్చుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్థానిక పోలీసు స్టేషన్ల అధికారులు తమ పరిధిలో నేర చరిత్రగల వ్యక్తులకు నోటీసులు జారీచేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అల్లర్లు సృష్టించవద్దని, పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోవాలని హెచ్చరించారు. నగరంలోని న్యాయమూర్తులు మొదలుకుని రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు తదితర వీఐపీలకు కల్పించిన భద్రతపై ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా, జెడ్, జెడ్ ప్లస్, వై స్థాయి భద్రత నగరంలో అనేకమంది ప్రముఖులకు ఉన్నాయి. వీరికి ఎంతమేర భద్రత అవసరం అనేదానిపై కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని తర్వాతే కేంద్రం నుంచి క్విక్ రెస్పాన్స్ టీ, సీఆర్పీ తదితర అదనపు బలగాలు దిగుమతి చేసుకోవాలా లేక రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎస్‌ఆర్పీ, ఇతర పోలీసు బలగాలనే వినియోగించుకోవాలా అనే దానిపై స్పష్టత వస్తుందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఎన్నికల భద్రత కట్టుదిట్టం
Published Fri, Mar 28 2014 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM
Advertisement