సాక్షి, ముంబై: రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మరింత భద్రత చేకూర్చేందుకు రాష్ట్ర హోంశాఖ కొత్తగా పోలీసు సిబ్బందిని నియమించనుంది. పోలీసు కంట్రోల్ రూమ్‌తో అనుసంధానమైన 318 పోలీస్ పెట్రోల్ వ్యాన్లకు గాను 3,828 మంది పోలీసు సిబ్బందిని నియమించనుంది. ఈ వ్యాన్లు పబ్లిక్ స్థలాల వద్ద పెట్రోలింగ్ నిర్వహించనున్నాయి. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో మహిళలు కంట్రోల్‌రూంకు కాల్ చేసినప్పుడు ఈ వ్యాన్లు స్పందిస్తాయి. ప్రత్యేకించి మహిళల భద్రత కోసం, అదేవిధంగా అదృశ్యమైన చిన్నారులను వెతికి పట్టుకోవడం కోసం మరో 4,585 మందిని నియమించనున్నారు. రాష్ట్ర హోంశాఖ 61,494 కొత్త పోస్టులను భర్తీచేసేందుకు ప్రతిపాదించింది. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనికి మంజూరు లభించినట్లు హోం మంత్రి ఆర్.ఆర్. పాటిల్ తెలిపారు. ఇందులో 6,300 పోస్టులు ముంబైకి కేటాయించినవి. కాగా మహిళా భద్రత విషయమై కోర్టు ఇటీవల సూచనలు జారీ చేయడంతో బస్సు స్టాపుల్లో, కళాశాలల్లో, మాల్స్ ఇతర పబ్లిక్ స్థలాల్లో రాష్ట్ర ప్రభుత్వం భద్రతా సిబ్బందిని మోహరింపజేయనుంది. అదనపు పోలీసు బలగాలతో వేధింపులు, అత్యాచారాలు, చోరీలు, కిడ్నాపులు వంటి వాటిని నివారించవచ్చని హోం శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు.
భద్రత విషయంలో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు లక్షల మంది సిబ్బందిఅవసరం ఉన్నా, ఆచరణలో అన్ని పోస్టుల భర్తీ సాధ్యంకాదని మరొక అధికారి అభిప్రాయపడ్డారు. కొత్తగా నియమించే సిబ్బందిలో పురుషులు, మహిళలు కూడా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ పోస్టుల భర్తీ ఐదు దశలుగా ఉంటుంది. మొదటి దశలో 12,000 మందిని నియమించనున్నారు. అలాగే అదనంగా మరో 122 పోలీసు స్టేషన్లను ఏర్పాటుచేసేందుకు హోంశాఖ యోచిస్తోంది. అదనంగా పోలీసు సిబ్బందిని నియమించుకోవడంతో రాష్ట్ర ఖజానాకు రూ.8,000 కోట్ల ఆర్థిక భారం పడనుందని అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ మాట్లాడుతూ కొత్త సిబ్బంది నియామకం పూర్తయితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందన్నారు. ఈ సిబ్బందిలో 5 శాతం మందిని ప్రత్యేకంగా చిన్నారుల కేసుల నిమిత్తం నియమిస్తామన్నారు. గత ఐదేళ్లలో 55 వేల మంది పోలీస్ సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. అధికారిక అంచనా ప్రచారం రాష్ట్రంలో ప్రస్తుతం 1,95,000 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారని, కొత్త పోస్టుల భర్తీతో ఆ సంఖ్య రెండున్నర లక్షలకు చేరుతుందని ఆయన తెలిపారు.