న్యూఢిల్లీ: నగరంలో విధిస్తున్న అప్రకటిత నీటి, విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరల పెరుగుదల, విద్యుత్, నీటి కోతలపై ప్రభుత్వ తీరును తప్పుబడుతూ డీపీసీసీ అధ్యక్షుడు అర్వీందర్‌సింగ్ నేతృత్వంలో ఆందోళనకు దిగింది. ఆదివారం ఉదయం 9 గంటలకు అశోక్‌విహార్‌లోని వాటర్‌ట్యాంక్ సమీపంలోగల ప్రధాన రహదారిపై లవ్లీతోపాటు కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేశారు. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లవ్లీ మాట్లాడుతూ... విద్యుత్ కంపెనీల ఒప్పందాలను బీజేపీ ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటోందని ఆరోపించారు.
ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఇష్టానుసారంగా కొనసాగుతున్నాయని, నీటి సరఫరా కూడా సక్రమంగా జరగడంలేదని లవ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు 24 గంటలపాటు విద్యుత్, అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేస్తామని కోతలు కోసిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తోందమేమిటని లవ్లీ నిలదీశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను చెదర గొట్టేందుకు ప్రయత్నించారు. అయినా వారి నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో సీనియర్ పోలీస్ అధికారి ఒకరు లవ్లీతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
ఇవేం కోతలు..?
Published Sun, Jul 13 2014 11:57 PM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement