తెలంగాణకు నిధులివ్వడంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చెప్పారు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన విజయవాడ వచ్చారు. స్టేట్ గెస్ట్‌హౌస్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలన్నీ చాలా వెనకబడి ఉన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు ఇంకా నిదులు సరిగా విడుదల కాలేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 80శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారని చెప్పారు. రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలు అన్నదమ్ములు మాదిరిగా కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఆంధ్ర ప్రజలు కూడా అబివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని తమ ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 10 సీట్లు ఆంధ్ర సోదరులకు ఇచ్చామని చెప్పారు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు మత సామరస్యం కాపాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు అధికారులను ఆదేశించారని చెప్పారు. పోలీసు శాఖలో వాహనాలు ఇతర మౌలిక సౌకర్యాల కోసం రూ. 350 కోట్లు ఖర్చుచేశామని చెప్పారు. ఫలితంగా పోలీసు అధికారులు గోదావరి, కృష్ణాపుష్కరాలు, గణేశ్ నిమజ్జనం వంటి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబివృద్ధి కార్యక్రమాలను సమర్ధంగా నిర్వహిస్తోందన్నారు. ఓటుకు నోటు, గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసుల విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కోర్టు విచారణలో ఉండడంతో తాను మాట్లాడనన్నారు.
తెలంగాణకు నిధులివ్వడంలో కేంద్రం పక్షపాతం: నాయిని
Published Sun, Sep 18 2016 8:44 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement