సర్కారుకు అండ!
Published Thu, Mar 13 2014 1:51 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు బుధవారం హైకోర్టులో చుక్కెదురైంది. ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు కల్పించవచ్చన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు హైకోర్టు మద్దతు ఇచ్చింది. ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినుల పిటిషన్లు విచారణ యోగ్యం కాదంటూ తిరస్కరించింది.సాక్షి, చెన్నై: ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలకు అర్హులుగా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల్లో ఆగ్రహాన్ని రేపింది. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు కల్పించాలన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి. ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో చదువుకుని, శిక్షణ పొందిన వారికి ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించాలని ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినులు కోర్టును ఆశ్రయించారు. గత వారం తీర్పు వెలువడాల్సి ఉండగా, వాయిదా పడింది. దీంతో ఆవేదనకు లోనైన విద్యార్థినులు హైకోర్టు పైకి ఎక్కి ఆత్మాహత్యాయత్నం చేశారు. ఎట్టకేలకు విచారణ ముగియడంతో బుధవారం తీర్పు వెలువడింది.
సర్కారుకు అండ: న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, సత్యనారాయణన్‌ల నేతృత్వంలోని బెంచ్ మధ్యాహ్నం తీర్పు వెలువరించింది. ప్రభుత్వ నర్సింగ్ క ళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినుల వాదనలను కోర్టు తోసి పుచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు అర్హత, ప్రతిభ ఉన్నవారందరూ ఉపయోగించుకోవచ్చని, పలానా వాళ్లకు ఇవ్వాలి, ఇవ్వకూడదన్న ఆంక్షలేమీ లేవన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను సమర్థిస్తున్నామని, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థినుల పిటిషన్లను తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. దీంతో ఆ విద్యార్థినులకు చుక్కెదురైనట్టు అయింది. తమకు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సింగ్ ఉద్యోగాలు లభించనుండడంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటూ, శిక్షణ పొందుతున్న విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ నర్సింగ్ విద్యార్ధినులు తదుపరి కార్యచరణకు సిద్ధం అవుతున్నారు.
Advertisement
Advertisement