నోయిడా: నగరంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ప్రజలు అభద్రతాభావంలో జీవించాల్సి వస్తోంది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు స్థానికులు మొరపెట్టుకొన్నా ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగాలు నేరాలను అదుపు చేయలేకపోతున్నాయి. సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప ఆ రెండు యంత్రాంగాలు ఏమీ చేయలేకపోతున్నాయి. మహా అయితే కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం అధికారులకు పరిపాటిగా మారింది. దీన్ని అధిగమించేందుకు స్వీయ భద్రతా చర్యలకు నగరవాసులు నడుం బిగించారు.
సెక్టార్ 39 పరిధిలో స్వీయ రక్షణ చర్యలు
ఆర్‌డబ్ల్యూఏ పరిధిలోని 39వ సెక్టర్‌లోని కొన్ని గృహసముదాయాలకు చెందిన ప్రజలు గ్రూపుగా ఏర్పడి, తమకు అవసరమైన భద్రతా చర్యలను తీసుకొన్నారు. ఇందుకు సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకోవడంతోపాటు రక్షణ చర్యలు తీసుకొన్నారు. గేట్‌ల ఎదుట సీసీటీవీలు, అపరిచిత వాహనాలు లోపలికి ప్రవే శం లేదనే బోర్డులు, ప్రవేశ, బయటి ద్వారాల వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసుకొన్నారు. ఇంటి చుట్టూ ఇనుపవైర్లతోపాటు గేటు ముందు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలు జరగకుండా నివారించేందుకు ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా సొంతంగా సెక్యూరిటీ వ్యవస్థను కట్టుదిట్టం చేసుకొన్నామని పలువురు నగర వాసులు పేర్కొన్నారు.
ప్రతినెలా రూ. 2లక్షలు ఖర్చు చేస్తున్నాం: అధ్యక్షురాలు
ఆర్‌డబ్ల్యూఏ 39వ సెక్టర్ సంఘం అధ్యక్షురాలు సుమిత్రా చోప్రా మాట్లాడుతూ.. మా సెక్టర్ భద్రత కోసం ప్రతి నెలా రూ.2.లక్షలను వెచ్చిస్తున్నాం. ఫలితంగా చైన్‌స్నాచింగ్‌లు, కార్ జాకింగ్స్‌లాంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయి. సెక్టార్ భద్రత కోసం వైర్ కంచెను ఏర్పాటు చేశాం. దీని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుంది. ఈ కంచెను ఒక వ్యక్తి తొలగించడం సులువుకాదు. అంత పటిష్టంగా ఉంటుందని చెప్పారు.
అన్నింటికీ పోలీసులపై ఆధారపడొద్దనే..
అదేవిధంగా ‘సురక్షితమైన జీవనం కోసమే మా సెక్టర్‌లో ప్రైవేట్ భద్రతా చర్యలు తీసుకొన్నాం. నగరంలో పోలీసు సిబ్బంది కొరత కూడా ఉంది. అందుకే సెక్టార్‌లో పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రతి చిన్న విషయానికి పోలీసుల మీద ఆధారపడడం కూడా సముచితం కాదు. కాలనీ ప్రజలంతా కలిసి నవరాత్రులు, తదితర పండుగలను నిర్వహిస్తుంటాం. ఇలాంటి సమయంలో భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు, శాంతియుతంగా పండుగలు జరుపుకోవడానికి అవసరమైన చర్యలను అందరం కలిసే తీసుకొన్నామని మరో సభ్యురాలు చెప్పారు.
కాలనీ అభివృద్ధికి సహకరించాలి
మా పరిసరాలను శుభ్రంగా, భద్రంగా ఇతర కాల నీల ప్రజలకు ఆదర్శంగా తీర్చిదిద్దుకొంటున్నాం.. కాలనీ ప్రజలు సురక్షితంగా జీవించడానికి అవసరమైన అన్ని చర్యలు మేమే తీసుకొంటున్నాం. మా కాలనీలోని పార్కులను చూసుకోవడానికి తోటమాలీలు, స్వీపర్లను అధికారుల కేటాయించారు అని చెప్పారు. మా కాలనీ అభివృద్ధికి అధికారులు సహకరించాలని పలువురు నగరవాసులు కోరుతున్నారు.
ప్రైవేట్ భద్రత కట్టుదిట్టం
Published Thu, Sep 18 2014 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM
Advertisement
Advertisement