రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని కోరుతూ వేలాది కార్యకర్తల సమక్షంలో డీఎండీకే అధినేత విజయకాంత్ గురువారం నిరాహారదీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని కోరుతూ వేలాది కార్యకర్తల సమక్షంలో డీఎండీకే అధినేత విజయకాంత్ గురువారం నిరాహారదీక్ష చేపట్టారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యం నిషేధం విధించాలనే డిమాండ్‌పై రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నీ గళమెత్తిన నేపథ్యంలో డీఎండీకే కొన్ని రోజుల క్రితం మానవహారంతో తన నిరసన ప్రకటించింది. మద్యంపై పోరులో భాగంగా చెన్నై కోయంబేడులోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఉదయం సతీమణి ప్రేమలతతో కలిసి కెప్టెన్ నిరాహారదీక్షలు ప్రారంభించారు. వేలాది మంది కార్యకర్తలు రాష్టం నలుమూలల నుంచి తెల్లవారుజామునే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం ముందు భాగంగా భారీగా నిర్మించిన వేదికపై పార్టీ యువజన విభాగం కార్యదర్శి ఎల్‌కే సుధీష్ సహా ముఖ్యనేతలు కూడా కూర్చున్నారు. మద్య నిషేధం నినాదాలతో కూడిన ప్లకార్డులను వేదిక చుట్టూ అలంకరించారు. ఉదయం 9 గంటలకు నిరాహారదీక్షలు ప్రారంభం కాగా 9.20 గంటలకు విజయకాంత్ వేదికపైకి చేరుకున్నారు.
ప్రజలే బుద్ధి చెప్పాలి: విజయకాంత్
ప్రజల జీవితాలను పణంగాపెట్టి మద్యంపై వచ్చే ఆదాయంతో బతుకున్న ఈ ప్రభుత్వానికి అదే ప్రజలు బుద్ధి చెప్పాలని విజయకాంత్ పిలుపునిచ్చారు. పాఠశాలలు, కాలేజీలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, బస్‌స్టేషన్లు అనే విచక్షణ లేకుండా టాస్మాక్ దుకాణాలకు అనుమతులిచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ధనదాహానికి మహిళలు, విద్యార్థులు, బాలురు సైతం మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కంటే మద్యం అమ్మకాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యం వద్దంటూ మహిళలు సాగిస్తున్న పోరు, ప్రజా, విద్యార్థి సంఘాల ఆందోళనలపై ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. టాస్మాక్ దుకాణాల నిర్వహణలో అక్కడి సిబ్బందే అశువులు బాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మద్యం నిషేధం కోసం సాగుతున్న పోరాటంలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.