సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం సాయంత్రం విశ్వాస పరీక్ష జరగనుండగా పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తచర్యగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. బెంగళూరు నగరంలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఓ అపార్టుమెంట్‌లో ఉన్నారన్న వార్త మంగళవారం సాయంత్రం ఉద్రిక్తతకు కారణమయింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు అక్కడ హైడ్రామా నడిచింది. బీజేపీ డౌన్‌డౌన్ అని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ అపార్టుమెంట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
అంతలోనే పోలీసులతోపాటు కార్పొరేటర్ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేశారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నగరంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు మద్యం మత్తులో కొందరు ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే, బార్లు, పబ్బులు, మద్యం దుకాణాలను. మద్యం విక్రయాలను బంద్ చేయించాం’అని పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు.
4 వారాల గడువు కోరిన రెబెల్స్
శాసనసభ్యత్వానికి తమను అనర్హులుగా ప్రకటించాలంటూ వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్‌లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు తమ లాయర్ ద్వారా స్పీకర్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. నాలుగు వారాల తర్వాత స్పీకర్ ఎదుట హాజరవుతామంటూ తాము లాయర్ ద్వారా సమాచారం అందించామని హన్సూర్ ఎమ్మెల్యే(జేడీఎస్) ఏహెచ్ విశ్వనాథ్ వెల్లడించారు. (చదవండి: బీజేపీలో ఆనందోత్సాహాలు; యెడ్డీకి సీఎం పగ్గాలు! )
Comments
Please login to add a commentAdd a comment