Prohibitory orders
-
Farmers movement: రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’
న్యూఢిల్లీ/చండీగఢ్: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, స్పైక్ బారియర్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. టొహానా బోర్డర్ వద్ద ఇసుక కంటెయినర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. సోమవారం చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహా్వనించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చ్‌కి పిలుపివ్వడం తెలిసిందే. దాంతో ట్రాక్టర్ ట్రాలీ మార్చ్ సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హరియాణా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో సెక్షన్ 144 విధించింది. శంభు వద్ద పంజాబ్‌తో సరిహద్దును మూసివేసింది. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సరీ్వసులను, బల్క్ ఎస్ఎంఎస్లను మంగళవారం దాకా నిషేధించింది. 2020–21లో రైతులు ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించిన సింఘు, ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లనే ఏర్పాటు చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో కూడా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, పంజాబ్ సరిహద్దుల్లో 5 వేల మంది పోలీసులను నియోగించారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించుకుని లోపలికి రాకుండా ఘగ్గర్ ఫ్లై ఓవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇనుపïÙట్లను అమర్చారు. ఏదేమైనా కనీసం 20 వేల మంది రైతులు ఢిల్లీ తరలుతారని రైతు సంఘాలంటున్నాయి. మోదీ సర్కారు నిరంకుశత్వంతో రైతులను అడ్డుకోజూస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. దాన్ని ఢిల్లీ నుంచి శాశ్వతంగా పారదోలాలని పిలుపునిచ్చారు. -
నూహ్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
చండీగఢ్: శోభాయాత్ర పిలుపు నేపథ్యంలో నూహ్ జిల్లాలో ఈ నెల 28 వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడంతోపాటు నిషేధాజ్ఞలు అమలు చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 31వ తేదీన జరిగిన మతపర ఘర్షణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చర్యలు తీసుకున్నట్లు వివరించింది. నూహ్‌లో సోమవారం తలపెట్టిన శోభాయాత్రకు అనుమతులు నిరాకరించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీ వరకు జరిగే జి–20 షెర్పా సమావేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయించామన్నారు. మొబైల్ ఇంటర్నెట్తోపాటు ఎస్ఎంఎస్ సర్వీసులపైనా నిషేధం విధించామన్నారు. సంఘ విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యమని చెప్పారు. ఈ నెల 26–28 తేదీల మధ్య 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని డీజీపీ శత్రుజీత్ కపూర్ చెప్పారు. -
అయోధ్య కౌంట్‌డౌన్ : విద్యాసంస్ధల మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడనుండటంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్, యూపీ, జమ్ము కశ్మీర్, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూసివేశారు. యూపీలో ముందుజాగ్రత్త చర్యగా శనివారం నుంచి సోమవారం వరకూ విద్యాసంస్థలను మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు గోవా, యూపీ, జమ్ము కశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. భోపాల్, బెంగళూర్లలో నిషేధాజ్ఞలు విధించారు. బెంగళూర్‌లో శనివారం ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్లో పరీక్షలు వాయిదా వేసిన అధికారులు శనివారం మద్యం విక్రయాలు ఉండవని డ్రైడేగా ప్రకటించారు. ఇక హైదరాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను నియమించామని, హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. -
రేపు కశ్మీర్లో ఆంక్షల సడలింపు..!
శ్రీనగర్/న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ లోయలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. కేంద్రం నిర్ణయాల అనంతరం భద్రతా బలగాల నీడలో ఉన్న కశ్మీర్లో పెద్దగా అలజడులు చెలరేగలేదు. చిన్నాచితక ఘటనలు మినహా ఆందోళనలు అంతగా చోటుచేసుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ముస్లిం ప్రజల ప్రార్థనల సందర్భంగా కేంద్రం భద్రతా ఆంక్షలను సడలించే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా సోమవారం బక్రీద్ ఉండటంతో ఆ రోజు కూడా నిషేధాజ్ఞలను సడలించి.. జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 12న ముస్లిం ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా లోయలో 144 సెక్షన్ ఎత్తివేతతోపాటు ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా పునరుద్ధరించే అవకాశముంది. లోయలోని పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా దగ్గరుండి పరిశీలిస్తున్నారు. భద్రతా బలగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న బందోబస్తును పర్యవేక్షించడంతోపాటు కశ్మీర్ విషయంలో కేంద్రం తాజా నిర్ణయాలపై స్థానికుల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి భోజనం చేసిన వీడియో ఒకటి తాజాగా వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దును స్థానికులు స్వాగతిస్తున్నారని ఆయన కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. -
బెంగళూరులో 144 సెక్షన్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం సాయంత్రం విశ్వాస పరీక్ష జరగనుండగా పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్తచర్యగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. బెంగళూరు నగరంలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఓ అపార్టుమెంట్లో ఉన్నారన్న వార్త మంగళవారం సాయంత్రం ఉద్రిక్తతకు కారణమయింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు అక్కడ హైడ్రామా నడిచింది. బీజేపీ డౌన్‌డౌన్ అని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆ అపార్టుమెంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అంతలోనే పోలీసులతోపాటు కార్పొరేటర్ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేశారు. ‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నగరంలో ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేందుకు మద్యం మత్తులో కొందరు ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే, బార్లు, పబ్బులు, మద్యం దుకాణాలను. మద్యం విక్రయాలను బంద్ చేయించాం’అని పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. 4 వారాల గడువు కోరిన రెబెల్స్ శాసనసభ్యత్వానికి తమను అనర్హులుగా ప్రకటించాలంటూ వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేశ్ కుమార్‌ను కోరారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు తమ లాయర్ ద్వారా స్పీకర్‌కు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. నాలుగు వారాల తర్వాత స్పీకర్ ఎదుట హాజరవుతామంటూ తాము లాయర్ ద్వారా సమాచారం అందించామని హన్సూర్ ఎమ్మెల్యే(జేడీఎస్) ఏహెచ్ విశ్వనాథ్ వెల్లడించారు. (చదవండి: బీజేపీలో ఆనందోత్సాహాలు; యెడ్డీకి సీఎం పగ్గాలు! ) -
తీరంలోనే లంగరు..
ప్రకృతి వైపరీత్యాలు.. పాలకుల నిషేధాజ్ఞలతో జిల్లాలోని మత్స్యకారుల గ్రామాల్లో చేపల వేట తీరం దాటడం లేదు. సముద్రం నిండుగా చేపలు ఉన్నా.. అందులోకి వెళ్లి వేట చేయలేని దుస్థితి. తీరం వెంబడి సముద్రంలోకి వెళ్లే ముఖద్వారాల వద్ద ఇసుక మేటలతో వేట సాగించే బోట్లు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి పూడికతీతకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడంతో గంగపుత్రులు వేటకు దూరం అవుతున్నారు. వాకాడు(నెల్లూరు): జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులకు చేపల వేటకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. సముద్రంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో వేట అంతంత మాత్రంగా సాగుతోంది. దీనికి తోడు పునరుత్పత్తి కాలంగా ఏటా రెండు నెలలు వేటను నిషేధిస్తున్నారు. మిగిలిన కాలంలో సజావుగా వేట సాగించడానికి ముఖద్వారాల వద్ద పేరుకుపోయిన ఇసుక మేటలు వేటకు ఇబ్బందికరంగా మారింది. ప్రతి తీర గ్రామం నుంచి సముద్రంలోకి వెళ్లడానికి ముఖద్వారాలు ఉన్నాయి. సముద్రంపై సజావుగా వేటసాగాలంటే సాగర ముఖద్వారాలు తెరుచుకుని నిండుగా నీరు ప్రవహించాల్సి ఉంది. మత్స్యకారులు తమ బోట్లను ఎలాంటి ఆటంకం లేకుండా సముద్రంలోనికి తీసుకెళ్లడం, వేట తర్వాత మత్స్య సంపదను తీరానికి చేర్చడానికి వీలు అవుతుంది. కానీ ప్రస్తుతం సముద్రంతీరం ఆటు, పోటుల కారణంగా అన్ని చోట్ల ముఖద్వారాల వద్ద 10 మీటర్లు ఎత్తులో ఇసుక మేటలు వేయడంతో పూడిపోయింది. వేటకు పాట్లు జిల్లాలో 14 చోట్ల సముద్ర ముఖద్వారాలు ఉన్నాయి. అందులో ముత్తుకూరు, జువ్వలదిన్నె ముఖద్వారాలు మినహా మిగిలిన ద్వారాలు మూసుకుపోవడంతో మత్స్యకారులు వేటకు ఇక్కట్లు పడుతున్నారు. జిల్లాలోని 113 మత్స్యకార గ్రామాలకు చెందిన 6 వేల ఫైబర్ బోట్లపై ఆధారపడిన 60 వేల మంది మత్స్యకారులు నానా పాట్లు పడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సముద్రుడు కరుణించడంతో మత్స్యకారులకు ఇప్పుడు మత్స్యసంపద దండిగా దొరుకుతుంది. అయితే మత్స్యకారులు మాత్రం వేటకు వెళ్లలేక తమ బోట్లకు తీరం ఇవతలే లంగర్ వేయాల్సిన పరిస్థితి దాపురించింది. పట్టించుకోని పాలకులు, అధికారులు మత్స్యకారుల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న పాలకులు, అధికారులు సముద్ర ముఖద్వారాల్లో పూడిక తీతను పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా మత్స్యకార సంఘాల నాయకులు, గ్రామ కాపులు, మత్స్యకారులు సముద్ర ముఖద్వారాల వద్ద పూడిక తీయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సభల్లో విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మత్స్యకారులే అప్పులు చేసి ఏటా రూ. 10 లక్షలు ఖర్చు పెట్టుకుని ముఖద్వారాల పూడిక తీత పనులు చేయించుకుంటున్నారు. జిల్లాలో వాకాడు, కోట, చిల్లకూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, విడవలూరు, కొడవలూరు, అల్లూరు మండలాల్లో మత్స్యకారులే చందాలు వేసుకుని ప్రస్తుతం ముఖద్వారాల పూడికలు తీయించుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాకాడు మండలం కొండూరుపాళెం సముద్ర ముఖద్వారం వద్ద మత్స్యకారులు పూడిక పనులను వేగంగా సాగిస్తున్నారు. నిషేధ కాలానికి పరిహారం.. కాగితాలకే పరిమితం రెండేళ్లుగా వేట నిషేధిత కాలంలో మత్స్యకారులకు అందించే సాయం కాగితాలకే పరిమితమైంది. గతంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు వేట విరామం కింద రూ. 2 వేలు సాయం అందించే వారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని రెట్టింపు చేసి రూ.4 వేలు సాయంగా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన మత్స్యకారుల్లో ఆనందాన్ని నింపినప్పటికీ రోజులు గడిచే కొద్దీ నిరాశే మిగిల్చింది. వేట విరామం నగదు సాయం కోసం జిల్లాలో అధికారికంగా 3,500 బోట్లు, 21 మర పడవలపై ఆధారపడిన 15 వేల మంది మత్స్యకారులు నమోదు చేసుకున్నారు. మత్స్యకారులకు చెందిన రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ విధిగా ఉండాలని మెలిక పెట్టి ఆంక్షలు విధించడంతో రెండేళ్లుగా దాదాపు 10 వేల మందికి పరిహారం అందని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వేట విరామంలో ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించి ఉంటే మత్స్యకారులకు కొంత మేర ఉపయోగపడేది. కానీ రెండేళ్లుగా ఒక్కపైసా కూడా అందకపోవడం, వేట సజావుగా సాగకపోవడంతో మత్స్యకారులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి తీర గ్రామాల్లోని ముఖద్వారాల వద్ద పూడిక తీత పనులకు చర్యలు చేపట్టాలని జిల్లాలోని మత్స్యకారులు కోరుచున్నారు. నెల రోజులుగా వేట లేదు సముద్ర ముఖద్వారాలు పూడిపోవడంతో నెల రోజులుగా వేట చేయలేకపోతున్నాం. ఈ విషయాన్ని అనేకసార్లు జిల్లా కలెక్టర్‌కు, ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. తూపిలిపాళెం, కొండూరుపాళెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు చందాలు వేసుకుని రూ. 5 లక్షలు వ్యయంతో పూడిక తీయిస్తున్నారు. – మేలంగారి పోలయ్య, కాపు కొండూరుపాళెం రెండేళ్లుగా డబ్బులు రావడం లేదు రేషన్‌కార్డు, ఆధార్ కార్డులను అధికారులు తప్పులుగా ఉన్నాయంటూ మెలిక పెట్టి రెండేళ్లుగా వేట విరామం డబ్బు ఇవ్వడం లేదు. నిజంగానే ఆధార్, రేషన్ కార్డులు తప్పులుగా ఉంటే తమకు రేషన్, పింఛన్, బ్యాంక్, తదితర లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం, పాలకపక్షాన ఉన్న అధికారులు ఆడుతున్న నాటకం మాత్రమే. గత ప్రభుత్వంలో వేట విరామం నగదు సకాలంలో అందేది. – కె. రాజు, మత్స్యకారుడు, కొండూరుపాళెం సముద్ర ముఖద్వారాల పూడిక పనులపై ప్రభుత్వానికి నివేదించాం ఇసుక మేటలతో పూడిపోయిన సముద్ర ముఖద్వారాల పూడిక పనుల విషయమై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. పూడికతీత పనులు వేల రూపాయలతో జరిగేవి కావు. రూ.లక్షల రూపాయలతో కూడిన వ్యవహారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. – కె రమేష్‌బాబు, ఎఫ్డీఓ -
సెక్రటేరియట్ పరిధిలో నిషేధాజ్ఞలు
హైదరాబాద్: సైఫాబాద్ ఠాణా పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో నగర పోలీసులు ఆంక్షలు విధించారు. లిఖితపూర్వకమైన అనుమతి లేకుండా ఎటువంటి ఆందోళనలు, ర్యాలీలు చేపట్టవద్దని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఆంక్షలు ఈ నెల 17 ఉదయం ఆరు గంటల నుంచి నవంబర్ 11వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ రెండు నెలల పాటు బహిరంగ సమావేశాలు, ఐదుగురు మించి వ్యక్తులు గుమికూడవద్దని, ఆయుధాల, బ్యానర్లు, ప్లకార్డులు తదితర వస్తువులు వెంట పెట్టుకోవద్దని కోరారు. ఇవి ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ 88 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని మహేందర్ రెడ్డి హెచ్చరించారు. -
హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు
యాకుత్‌పురా: హైకోర్టు పరిసర ప్రాంతాల్లో విధించిన నిషేధాజ్ఞలను పొడిగించారు. ఈనెల 17 ఉదయం 6 నుంచి అక్టోబర్ 15వ తేదీ ఉదయం 6 గంటలకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని మంగళవారం నగర పోలీసు కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. హైకోర్టు నుంచి సిటీ కళాశాల జంక్షన్, నయాపూల్ రోడ్డు, మదీనా సర్కిల్ నుంచి సిటీ కాలేజీ రోడ్డు, ఘాన్సీబజార్ నుంచి పటేల్ మార్కెట్, రికాబ్‌గంజ్, నయాపూల్ మదీనా సర్కిల్, పత్తర్‌గట్టి, ముస్లింజంగ్‌పూల్, మూసాబౌలి, మెహందీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయన్నారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నంత కాలం హైకోర్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, నిరసన, బహిరంగ సభలు, బైఠాయింపులు చేయకూడదని హెచ్చరించారు.