పులి రచ్చ
తమిళసినిమా: విజయ్ నటించిన తాజా చిత్రం పులి.ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. అయితే అనుకున్న సమయానికి థియేటర్లలో బొమ్మ పడకపోవడంతో అభిమానుల ఆందోళనతో పులి వ్యవహారం రచ్చరచ్చగా మారింది.పులి చిత్రం అక్టోబర్ ఒకటవ తేదీన విడుదలవుతుందని ప్రకటించడంతో విజయ్ అభిమానులు ఆనందోత్సాహాలకు గురయ్యారు.రాష్ట్రలోని ఇళయదళపతి అభిమానులందరూ గురువారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రదర్శనలు చూడటానికి టిక్కెట్లు కొనుక్కుని అంతకు ముందే థియేటర్ల ముందు ఆత్రుతగా చేరిపోయారు.త మ అభిమాన నటుడి చిత్రాన్ని తొలి రోజు తొలి షోను చూడబోతున్నామన్న ఆనందంలో మునిగిపోయారు.
అయితే వారి సంతోషంపై పోలీసులు నీళ్ళు చల్లారు.పులి చిత్రానికి ప్రత్యేక షోలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకట్ట వేయడంతో అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది. తమిళనాడులోని పలు థియేటర్ల వద్ద అభిమానులుఆందోళనలకు దిగారు.పోలీసులు అడ్డకోవడంతో పరిస్థితి ఉద్రిక్తకకు దారి తీసింది.కొన్ని చోట్ల థియేటర్ల యాజమాన్యం టికెట్ల ధరను తిరిగి చెల్లించడానికి సిద్ధపడ్డా అదనంగా డబ్బు చెల్లించాలంటూ అభిమానులు గొడవకు దిగారు. పులి చిత్రం గురువారం విడుదల కావలసి వుండగా ఫైనాన్సియర్ సమస్యతో విడుదల ఆలస్యమైంది.
ఇద్దరు అభిమానులు బలి : కాగా పులి చిత్ర ప్రచారంలో పాల్గొన్న విజయ్ అభిమానులు ఇద్దరు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తాంబరం సమీపంలోని మణిమంగళం కు చెందిన సౌందర్‌రాజన్ (22), ఉదయకుమార్ (23)లు విజయ్ వీరాభిమానులు. పులి చిత్రం విడుదల కానుండటంతో బుదవారం అర్ధరాత్రి మోటార్‌బైక్‌లో మణమంగళం,కరసంగాల్ పరిసర ప్రాంతాలలో పులి చిత్ర పోస్టర్లు అంటిస్తూ ప్రచారం చేశారు.అలా వండలూర్,వాలాజా రోడ్డులో బైక్ మీద వెళుతుండగా వెనకగా వచ్చిన లారీ ఢీకొంది. దాంతో ఆ అభిమానులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.లారీ డ్రైవర్ పరారయ్యారు.మణిమంగళం పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని మృతుల శవాలను పోస్టుమార్టం కోసం శ్రీ పెరంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.