‘పల్స్’ సక్సెస్
Published Mon, Feb 24 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
సాక్షి, చెన్నై : రెండో విడత పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం రాష్ట్రంలో విజయవంతం అయింది. రాష్ర్ట వ్యాప్తంగా 70 లక్షల మంది పిల్లలకు చుక్కల మందు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు పిల్లలకు చుక్కల మందు వేయించుకెళ్లారు. రాజ్ భవన్‌లో పిల్లలకు గవర్నర్ రోశయ్య చుక్కల మందు వేశారు. పోలియోను తరిమి కొట్టడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. పోలియో బారిన పిల్లలు పడకుండా ప్రతి ఏటా చుక్కలను వేయిస్తూ వస్తున్నారు. తొలి విడతగా జనవరిలోను, మలి విడతగా ఫిబ్రవరిలోను చుక్కలు వేస్తున్నారు. ఆదిశగా తొలి విడత కార్యక్రమాన్ని రాష్ర్టంలో గత నెల విజయవంతం చేశారు. మలి విడతగా ఆదివారం పిల్లలకు చుక్కలు వేశారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్ వాడీ కేంద్రాలతో పాటుగా బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వినోద కేంద్రాలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో ప్రభుత్వం శిబిరాల్ని ఏర్పాటు చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా 43,550 శిబిరాలను ఏర్పాటు చేశారు. 7.39 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి శిబిరంలోను నలుగురు సిబ్బందిని నియమించారు. సంచారవాసులు, కార్మికుల పిల్లలు, ప్రయాణాల్లో ఉండే వారి కోసం ప్రత్యేకంగా 1,652 మొబైల్ శిబిరాలు, మరో వెయ్యి బృందాల్ని ఏర్పాటు చేశారు. వీరంతా ఆయా ప్రాంతాల్లోకి ఇంటింటా వెళ్లి చుక్కలు వేశారు. పల్స్ పోలియో విజయవంతానికి రెండు లక్షల మంది సిబ్బంది విధుల్లో నిమగ్నం అయ్యారు.
విజయవంతం: తొలి విడత పల్స్ పోలియోలో బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రులు, మలి విడతకు డుమ్మా కొట్టారు. ఇందుకు కారణం తమ అధినేత్రి జయలలిత పుట్టినరోజు ఏర్పాట్లలో బిజీగా ఉండటమే. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులే నేతృత్వం వహించారు. రాజ్ భవన్‌లో పిల్లలకు గవర్నర్ రోశయ్య చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెన్నైలో 1,325 శిబిరాలు ఏర్పాటు చేయగా, ఐదు లక్షలకు పైగా పిల్లలకు చుక్కల మందు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది పిల్లకు చుక్కలు వేసినట్టుగా ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, పాఠశాలలు, మెరీనా బీచ్, కోయంబేడు బస్టాండ్ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లలకు చుక్కలు వేయించుకెళ్లారు. ఎవరైనా పిల్లలకు చుక్కలు వేయించని పక్షంలో సోమ, మంగళవారాల్లో ఇళ్ల వద్దకే వెళ్లి పోలియో డ్రాప్స్ వేయడానికి ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది.
Advertisement
Advertisement