మదినిండా అప్పాజీ
ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ
దిగివచ్చిన తారాలోకం
గాజనూరు నుంచి స్మారక స్థలి వద్దకు చేరుకున్న రాజ్థ్రం
దాదాపు 54ఏళ్ల పాటు కన్నడ చిత్రసీమను ఏలిన కన్నడ కంఠీరవుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ రాజ్‌కుమార్ స్మరణతో బెంగళూరులోని కంఠీరవ స్టేడియం మారుమోగింది. శాండల్‌వుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన తారాలోకం కంఠీరవ స్టేడియానికి తరలివచ్చింది. అభిమానులంతా ‘అన్నగారు’ అంటూ ఎంతో భక్తితో పిలుచుకునే డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కంఠీరవ స్టేడియం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో కిక్కిరిసింది.
- సాక్షి, బెంగళూరు
కంఠీరవ స్టేడియంలోని రాజ్‌కుమార్ సమాధి వద్ద ఏర్పాటైన రాజ్‌కుమార్ స్మారకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి బి.సరోజాదేవి, రెబల్‌స్టార్ అంబరీష్, క్రేజీస్టార్ రవిచంద్రన్‌తోపాటు రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్, కుటుంబసభ్యులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్‌రాజ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు ఉమాశ్రీ, రోషన్‌బేగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక స్మారకం ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టూడియోకు తరలివచ్చారు. రాజ్‌కుమార్ సమాధిని దర్శించే అభిమానులకు ఆయన వివిధ సినిమాల్లో కనిపించిన వేషధారణలను సైతం కళ్లముందు నిలిపేందుకు సమాధికి ఇరువైపులా రాతిఫలకాలపై ఏర్పాటుచేసిన ఛా యాచిత్రాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయనే చెప్పవచ్చు. ఇక స్మారక ఆవిష్కరణ సందర్భంగా కంఠీరవ స్టూడియో అంతా రాజ్‌కుమార్ కటౌట్‌లు, పోస్టర్‌లతో నిండిపోయింది. రాజ్‌కుమార్ ఆశయాలను ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశంతో రాజ్‌కుమార్ స్వగ్రామం గాజనూరు నుంచి బయలుదేరి అన్ని జిల్లా కేంద్రాల్లో సంచరించిన రాజ్థ్రం శనివారం నాటికి కంఠీరవ స్టేడియంలోని స్మారకం వద్దకు చేరుకుంది. ఈ రథానికి రాజ్‌కుమార్ కుటుంబసభ్యులు, అభిమానులు ఘ నంగా స్వాగతం పలికారు. రాజ్‌కుమార్ సినీ విశేషాలను గుర్తు చేసుకునేందుకు గాను నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తారలు సందడి చేశారు.
‘అప్పాజీ’ చివరి కోరిక తీరలేదు....
ఇక స్మారక ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ రాజ్‌కుమార్ కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మాట్లాడుతూ...మరణానికి చేరువగా ఉన్న రో జుల్లో మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించాలని అప్పాజీ(డాక్టర్ రాజ్‌కుమార్) ఆశించారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామిపై అప్పాజీ కి ఎంతో భక్తి భావం ఉండేది. ఎప్పుడు సమయం దొరికినా రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లేవారు. మరణించే సమయానికి ముందు గురు రాఘవేంద్ర స్వామిని దర్శించాలని భావించారు. అయితే ఆ చివరి కోరిక తీరలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.