సాక్షి, ముంబై: అవినీతి ఖాకీల అంతుచూసేందుకు పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా రంగం సిద్ధం చేస్తున్నారు.నగర పోలీసు శాఖలో ఎంతమంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు? లంచాలు తీసుకుంటూ ఇప్పటిదాకా ఎంతమంది పట్టుబడ్డారు? తదితర వివరాలతో జాబితాను రూపొందించి తనకు అందజేయాలని సంబంధిత ఉన్నతాధికారులను మారియా ఆదేశించారు. ఆరోపణలు రుజువైనవారిపై కఠిన చర్యలు తీసుకునే విషయమై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనే నిర్ణయంలో ఆయన ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ప్రతిరోజూ ఎదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు లంచాలు స్వీకరిస్తూ కనీసం ముగ్గురు లేదా నలుగురు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడుతున్నారు. ఈ వివరాలు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఇటీవలే వెల్లడించారు. దీంతో అన్నిశాఖల అధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసుశాఖను కూడా సంస్కరించాలని మారియా భావిస్తున్నారు. ఏసీబీ వెల్లడించిన జాబితాలో పోలీసుశాఖ అగ్రస్థానంలో ఉంది. ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు.
డిప్యూటీ, అదనపు, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి మొదలుకొని కానిస్టేబుల్, సిపాయిస్థాయి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు ఎవరైనాసరే వారిని జాబితాలో చేర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. టాప్‌టెన్‌లో ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొదటిసారి పట్టుబడిన కానిస్టేబుళ్లను హెచ్చరించి వదిలేయాలని, అయినప్పటికీ వారిలో మార్పురాని పక్షంలో బదిలీ లేదా వెంటనే చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదనలను ఆయన రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇక లంచాలు తీసుకుంటు కానిస్టేబుళ్లు పట్టుబడితే అతడి పైఅధికారి ఇన్‌స్పెక్టర్‌ను, ఇన్‌స్పెక్టర్లు పట్టుబడితే వారి పైఅధికారులను బాధ్యులుగా చేయనున్నారు. పోలీసులు అవినీతికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో రాకేశ్ మారియా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అవినీతి ఖాకీల జాబితా ఇవ్వండి
Published Thu, May 15 2014 10:25 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement