దూసుకుపోతున్న చెన్నై ఎక్స్‌ప్రెస్
Published Tue, Aug 13 2013 4:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
న్యూఢిల్లీ: వసూళ్ల రేసులో వెనుకబడిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో మంచిరోజులే వచ్చినట్లున్నాయి. దీపికా పదుకొణెతో కలిసి నటించిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్ సంప్రదాయాలను అనుసరించి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దక్షిణాది ప్రాంతాల్లోనివారు కూడా ఎగబడి చూస్తున్నారు.
దీంతో బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తు దూసుకుపోతోంది ఈ చెన్నై ఎక్స్‌ప్రెస్. తొలివారంలోనే రూ.100 కోట్ల మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదు చేసిందని చెబుతున్నాడు ప్రముఖ విశ్లేషకుడు తరన్ ఆదర్శ్. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం శుక్రవారం రూ.33.12 కోట్లు, శనివారం 28.05 కోట్లు, ఆదివారం 32.50 కోట్లు, విడుదలకు ముందే ప్రివ్యూ షో ద్వారా గురువారం 6.75 కోట్లు వసూలు చేయడంతో కేవలం నాలుగు రోజుల్లో వందకోట్ల రూపాయలు వసూలు చేసిందన్నారు.
కేవలం రూ. 70 కోట్లు వెచ్చించి తెరకెక్కించిన ఈ చిత్రంలో యాక్షన్, కామెడీ, మాస్ మసాలా ఇలా అన్నీ కలగలిపి ఉండడంతో అన్నిరకాల ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వస్తోందని చెబుతోంది చిత్ర బృందం. సినిమా విడుదలకు ముందే తాము ఈ పరిస్థితిని ఊహించామని, అయితే ఇంత భారీగా వసూలు చేస్తుందనుకోలేదన్నారు. సినిమా ప్రచారం కోసం షారుఖ్, దీపికా పడిన శ్రమ వృధా పోలేదని, ఈ సినిమా హిట్ కావడంతో షారుఖ్‌కు వసూళ్ల దాహం తీరినట్లేనంటున్నారు.
Advertisement
Advertisement