డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని 40 వేల మంది రేషన్ షాపుల డీలర్లు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ నిలిచిపోయింది.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని 40 వేల మంది రేషన్ షాపుల డీలర్లు శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా చౌక దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ నిలిచిపోయింది. రాష్ర్టంలో 23 వేల మంది చౌక ధాన్యాల డీలర్లు, 17 వేల మంది కిరోసిన్ డీలర్లు ఉన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి దినేశ్ గుండూరావులు తమను చర్చలకు ఆహ్వానించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని డీలర్ల సంఘం అధ్యక్షుడు కె.కృష్ణప్ప తెలిపారు.
రేషన్ షాపుల పని వేళలను ఎనిమిది గంటలకు పరిమితం చేయాలని, పెట్రోలు బంకుల ద్వారా కిరోసిన్‌ను పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని, మహారాష్ట్ర తరహాలో కమీషన్‌ను చెల్లించాలని, హమాలీలకు కూలి పెంచాలని... తదితర డిమాండ్లతో డీలర్లు సమ్మె చేపట్టారు.