చర్చలకు సిద్ధం
♦ సామరస్యంగా సాగేనా ?
♦ వేదికగా అన్నాడీఎంకే కార్యాలయం
♦ తగ్గిన మంత్రులు
♦ త్యాగాలకు సిద్ధంగా వ్యాఖ్య
♦ సెంథిల్ కొత్త చిచ్చు
♦ శాసన సభా పక్షం పిలుపునకు డిమాండ్
సాక్షి, చెన్నై : విలీనం చర్చలకు ఓపీఎస్, కేపీఎస్ శిబిరాలు సిద్ధమయ్యాయి. రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం వేదికగా ఈ చర్చలు సోమవారం సాగనున్నాయి. రెండు రోజులుగా స్వరాన్ని పెంచిన వ్యాఖ్యల తూటాల్ని పేల్చిన మంత్రులు, ప్రస్తుతం త్యాగాలకు సిద్ధం అన్న వ్యాఖ్యల్ని అందుకున్నారు. ఇక, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ కొత్త చిచ్చు పెట్టే రీతిలో ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే ప్రయత్నంలో పడ్డట్టున్నారు.అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం దక్కించుకోవడం, అమ్మ జయలలిత ప్రభుత్వాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా మాజీ సీఎం ఓ పన్నీరు సెల్వం(ఓపీఎస్), ప్రస్తుత సీఎం కే పళనిస్వామి (కేపీఎస్)శిబిరాలు ఏకం అయ్యేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, పదవుల పందేరం వివాదాన్ని రేపుతున్నాయి.
సీఎం పదవి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని గురిపెట్టి సాగుతున్న పరిణామాలు చర్చల సజావుకు దోహద పడేనా అన్న ప్రశ్న బయలు దేరింది. అయితే, ముందుగా నిర్ణయించిన మేరకు చర్చలకు సర్వం సిద్ధం చేశారు. కేపీఎస్ శిబిరం పిలుపు మేరకు ఓపీఎస్ శిబిరం కమిటీ అన్నాడీఎంకే కార్యాలయంలోకి అడుగులు పెట్టనుంది. రెండు నెలల అనంతరం ఓపీఎస్ వర్గీయులు సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో అడుగు పెట్టబోతుండడం గమనార్హం. చర్చలు షురూ అని ఆర్థిక మంత్రి డి. జయకుమార్ సైతం స్పష్టం చేయడంతో అందరి దృష్టి అన్నాడీఎంకే కార్యాలయం వైపుగా మరలింది. చర్చల్లో ఎలాంటి అంశాలు తెర మీదకు రానున్నాయో అన్న ఉత్కంఠ బయలు దేరింది.
ఇన్నాళ్లు అధికారిక ప్రకటనలు కాకుండా, నేతల పరోక్ష వ్యాఖ్యలు, సంకేతాల రూపంలో చర్చల నినాదాల తెర మీదకు వచ్చినా, తాజాగా, ఎలాంటి అంశాలపై ఒత్తిడి తెచ్చి ఓపీఎస్ శిబిరం సాధించుకుంటుందో, ఇందుకు కేపీఎస్ తగ్గేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, సామరస్య పూర్వకంగా చర్చలు సాగవచ్చని కేపీఎస్ శిబిరం పేర్కొంటున్నా, త్వరితగతిన చర్చలు ముగించి విలీనం దిశగా ముందుకు సాగేందుకు ఓపీఎస్ శిబిరం అస్త్రాలను సిద్ధం చేసుకుని ఉందని చెప్పవచ్చు. రెండు రోజుల వరకు స్వరం పెంచిన కేపీఎస్ శిబిరానికి చెందిన మంత్రులు, తాజాగా, త్యాగాలకు సిద్ధం అని స్పందిస్తుండడం గమనించాల్సిన విషయం. ఓపీఎస్ కోసం తన ఆర్థిక పదవిని త్యాగం చేయడానికి సిద్ధం అని జయకుమార్ వ్యాఖ్యానించడం విశేషం.
సెంథిల్ కొత్త చిచ్చు : చర్చలకు సర్వం సిద్ధం చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ కొత్త చిచ్చును రేపే నినాదాన్ని తెర మీదకు తెచ్చారు. ఎవరికి వారు పదవుల పందేరం గురించి చర్చలు సాగించడమేనా, ఇక తామెందుకు అని బాలాజీ వ్యాఖ్యలు అందుకోవడం గమనార్హం. అరవకురిచ్చిలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం పదవి ఎవరికి కేటాయించాలని, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఎవరికి ఇవ్వాలని ఎవరికి వారు నిర్ణయం తీసుకోవడం కాదు అని, పార్టీ సమావేశం, శాసన సభా పక్ష సమావేశానికి పిలుపు నివ్వాలని డిమాండ్ చేశారు.
122 మంది ఎమ్మెల్యేలు బల పరీక్షలో మద్దతుగా నిలబట్టే సీఎం, మంత్రులు పదవుల్ని అనుభవిస్తున్నారన్న విషయాన్ని పరిగణించాలని హితవు పలికారు. పార్టీ శాసన సభా పక్షం తీసుకునే నిర్ణయం మేరకు శాసన సభా పక్ష నేత ఎంపిక సాగాలని, మెజారిటీ శాతం ఎమ్మెల్యేల మద్దతు మేరకు సీఎం అభ్యర్థిని ఎంపిక చేయాల్సిందేని ఆయన నినదించారు. తన నినాదానికి మద్దతు పలుకుతూ ఎమ్మెల్యేలు ముందుకు రావాలని ఆయన పిలుపు నివ్వడంతో పలువురు ఎమ్మెల్యేలు ఆ నినాదాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే, ఎంపీ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రవాణా మంత్రి ఎంఆర్.విజయ భాస్కర్‌లకు వ్యతిరేకంగా దీక్షకు సిద్ధం అవుతానని సెంథిల్ బాలాజీ ఈసందర్భంగా ప్రకటించడం గమనించాల్సిన విషయం.